ఓర్వలేకపోతున్న చంద్ర‌బాబు: మంత్రి జయరాం

YSRCP Leaders About 1 Year  Successful Journey Of YS Jagan - Sakshi

సాక్షి, క‌ర్నూలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న సంక్షేమ పథకాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం అన్నారు. వైఎస్సార్‌ సీపీ విజయ దుందుభి మోగించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలను నవరత్నాల‌ ద్వారా తొమ్మిది మాసాలలోనే సీఎం జగన్‌ పరిష్కరించారని చెప్పారు. తమ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తూ.. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. వలంటీర్‌ వ్యవస్థ వల్ల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని తెలిపారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వచ్చేనెలలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి జయరామ్‌ తెలిపారు.

పెద్ద మ‌న‌సు చాటుకున్న సీఎం జగన్‌
నేను ఉన్నా నేను విన్నాను అనే నినాదంతో ప్రజల కష్టాలను తీర్చిన నాయకుడు వైఎస్ జగన్ అని, పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన 9 నెలల్లోనే అందరికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం, ఇంగ్లీషు మీడియం, జగనన్న గోరుముద్ద వంటివి అమలు చేసిన ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని కొనియాడారు. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. విశాఖ గ్యాస్ లీక్ ప్ర‌మాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించి వైఎస్ జ‌గ‌న్ పెద్ద మ‌న‌సు చాటుకున్నార‌ని హ‌ఫీజ్ ఖాన్ అన్నారు.

చంద్ర‌బాబు బూట‌క‌పు పాల‌న‌కు ప్ర‌జ‌లు బుద్ది చెప్పిన రోజు ఇదని, చంద్ర‌బాబుకు మ‌తిమ‌రుపు పెరిగి వ‌య‌సు మ‌ళ్లిన మాట‌లు మాట్లాడుతున్నార‌ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. నీచ రాజకీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు పర్మినెంట్ క్వారంటైన్‌లోనే ఉండాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని, ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హమీలను అమలు చేశార‌ని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top