అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు?

YSRCP Buggana Rajendranath Reddy Criticizes AP Govt Over Data Theft Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌​ : ఫారమ్‌ 7 అప్లై చేయడం నేరం కాదని ఈసీ అధికారులే చెబుతున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకింత కంగారు పడుతుందని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. డేటా చోరీపై చంద్రబాబు నాయుడు ఇంతవరకు స్పష్టమైన సమాధానం చెప్పలేదని, హడావుడిగా రెండు జీవోలు మాత్రం జారీ చేశారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఏపీ ప్రభుత్వం సేవామిత్ర యాప్‌, ఫారమ్‌ 7కు సంబంధించి రెండు సిట్‌లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ ఓట్లు ఉన్న విషయాన్ని తమ పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లిందని పునరుద్ఘాటించారు. నకిలీ ఓట్లను తొలగించమనే ఫారమ్‌ 7 అప్‌లోడ్‌ చేశారు.. అందులో టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. సేవామిత్ర యాప్‌తో టీడీపీ నిండా మునిగిపోయిందని.. ఆ కేసును డైవర్ట్‌ చేసేందుకు ఫారమ్‌ 7పై 300లకు పైగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఎలక్షన్‌ కమిషన్‌ బాధ్యతను కూడా టీడీపీ తీసుకుంటుందా ఏంటి అని ఎద్దేవా చేశారు.

లోకేష్‌ ట్వీట్లు మాని బయటకు రావాలి..
సేవామిత్రలో 30 లక్షల మంది సమాచారం టీడీపీ వారిది అనుకుంటే 3 కోట్ల మంది ప్రజల సమాచారం ఎవరు ఇచ్చారని బుగ్గన ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అసలు అశోక్‌ను ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్న బుగ్గన... లోకేష్‌ ట్వీట్లు చేయడం మానేసి.. బయటికి రావాలని డిమాండ్‌ చేశారు. మూడు రోజుల్లో ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వస్తోందని చాటుగా 100 జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ సభ్యత్వ నమోదు వీడియోను బయటపెట్టారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలే చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top