‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. పార్టీని లాగేసుకున్నారు’

YS Sharmila Public Meeting At Penamaluru Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : సీఎం అంటే ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారని, సీఎం అంటే ఏ పనులు చేయకూడదో చంద్రబాబు చూపించారని, వెన్నుపోటు, మోసం నుంచి పుట్టినవాడే చంద్రబాబు అని వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరులో ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగిస్తూ.. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేశారని, పసుపు-కుంకుమతో మోసపోవద్దని అక్కాచెల్లెమ్మలకు చెప్పండని ప్రజలను కోరారు.

చంద్రబాబు ఉద్దేశం మంచిది కాదనీ మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచేశారన్నారు.  మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదన్నారు. సొంతమామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. పార్టీని లాగేసుకున్నారని అన్నారు. అమరావతిలో పర్మినెంట్‌ పేరుతో ఒక్క బిల్డింగ్‌ కూడా కట్టలేదని, బీజేపీతో కుమ్మక్కై హోదాను నీరుగార్చారని అన్నారు. హోదాపై చంద్రబాబు ఎన్నిసార్లు మాటలు మార్చారో.. ఆయన్ను చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. 

 నిరుద్యోగులకు జాబు రాలేదు కానీ.. చంద్రబాబు గారి కొడుకు లోకేశ్‌కు మూడు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ లోకేశ్‌కు కనీసం జయంతికి, వర్ధంతికి తేడా తెలియదని విమర్శించారు. ఒక్క ఎన్నిక కూడా గెలవని లోకేశ్‌ను మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చొపెట్టారనీ.. ఏం అర్హత ఉందని లోకేశ్‌ను మంత్రిని చేశారని ప్రశ్నించారు. లోకేశ్‌కేమో మూడు ఉద్యోగాలు.. యువతకేమో మొండిచేయి అంటూ ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలుకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు.. ఇప్పుడు పసుపు కుంకుమ పేరిట మహిళలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పసుపు కుంకుమ కింద ఇచ్చే డబ్బులు డ్వాక్రా మహిళల వడ్డీలకు కూడా సరిపోవన్నారు. జగనన్న పోరాటం వల్లే ఈరోజుకీ ప్రత్యేక హోదా బతికి ఉందని.. హోదా కోసం ధర్నాలు, దీక్షలు చేశారని గుర్తుచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top