పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేషజనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్
ఈ నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యేలకు రౌడీయిజంలో, గూండాయిజంలో, అవినీతిలో, అధికారులపై దౌర్జన్యం చేయడంలో, మహిళా అధికారులను జుట్టు పట్టుకుని ఈడ్చి బయటకు లాక్కెళ్లడంలో చక్కని శిక్షణ ఇచ్చారు. మట్టిని, ఇసుకను ఎలా దోచుకోవాలో శిక్షణ ఇచ్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు, లంచాలు ఎలా గుంజాలో అద్భుతంగా శిక్షణ ఇచ్చారు.
మీ నియోజకవర్గంలో ఒక నాయకుడున్నాడు. ఆయన ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే. ఆయన మీ అందరికీ తెలిసిన వ్యక్తే.. ఆయన పేరు ముళ్లపూడి బాపిరాజు. చంద్రబాబు శిక్షణలో ఆయన ఆరితేరి.. ఇసుక, మట్టి దోపిడీతో పాటు పేకాట కూడా ఆడించి నెలకు రూ.30 లక్షలు గుంజుతున్నాడు. పోలీసులు అడ్డు తగలకుండా
ఆయన చూసుకుంటున్నాడు.
–వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి కాపులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తానని, చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేనన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. అవినీతిలో, రౌడీయిజంలో చంద్రబాబు మాస్టర్ ట్రైనర్ (ప్రధాన శిక్షకుడు)గా మారారని ధ్వజమెత్తారు. కమీషన్ల లెక్క చూసుకునేందుకే ప్రతి సోమవారం పోలవరం వెళ్తున్నారని మండిపడ్డారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..
హామీలు నెరవేర్చండని అడిగితే..
నాలుగేళ్ల క్రితం టీడీపీ ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు ఏమన్నాడో చూడండి. ప్రతి కులానికి, వర్గానికి ఒక పేజీ పెట్టి మోసం చేశాడు. రజకులు, మత్స్యకారులను ఎస్సీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తామని, కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు చెప్పాడు. ఓట్లేసిన మత్స్యకారులు వెళ్లి.. ‘నాలుగేళ్లు అయిపోతోందయ్యా.. మమ్మల్ని ఎస్సీలుగా ఎప్పుడు చేస్తారు’ అని చంద్రబాబును అడిగితే.. ‘తాటతీస్తా’ అని బెదిరించాడు. చంద్రబాబు చెప్పింది చేయనందుకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి తాటతీస్తాడంట. కాపులు వెళ్లి.. ‘అయ్యా మాకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పావ్. ఎప్పుడు చేస్తావు’ అని అడిగితే లాఠీలతో కొట్టించడం, దొంగకేసులు పెట్టించడం, ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టించడం, అంతటితో ఆగకుండా హౌస్ అరెస్టులు చేయించడం చేశాడు. నాలుగేళ్లుగా జరుగుతున్న తీరిది. కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కొన్ని కేంద్రం పరిధిలో ఉంటాయి. రాష్ట్ర పరిధిలో లేని అంశాలను ఏవరైనా వచ్చి మేం చేస్తాం అని చెబితే అది అబద్ధం, మోసం అవుతుందా? కాదా? అంతకన్నా వేరే కేసు ఏమైనా ఉంటుందా? అటువంటి వారిపై 420 కేసు పెట్టి జైలులో పెట్టాల్సిన పని లేదా? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏది తన చేతిలో ఉంటుందో, ఏది ఉండదో తెలిసి కూడా ప్రజలను మోసం చేయడం ధర్మమేనా? ఇవాళ మీరు వెబ్‌సైట్‌లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కోసం బటన్ నొక్కండి. ఎక్కడా ఎన్నికల ప్రణాళిక కన్పించదు. ఎందుకో తెలుసా? ఎన్నికల ప్రణాళిక కన్పిస్తే ఆయన మోసాలు బయటపడి జనం కొడతారని చంద్రబాబుకు భయం.
15కు 15 సీట్లిస్తే మీకిచ్చిందేమిటి?
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు 2014 ఎన్నికల్లో 15కు 15 సీట్లు ఇస్తే చంద్రబాబు తాడేపల్లిగూడెం నియోజకవర్గం సహా ఈ జిల్లాకు ఏమిచ్చారు? తాడేపల్లిగూడేనికి ఎయిర్‌పోర్ట్ అన్నాడు.. ఆ కథ దేవుడెరుగు.. ఒక్క రోడ్డన్నా వేశారా? నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వరకు, తాడేపల్లిగూడెం నుంచి భీమవరానికి, కైకలూరు నుంచి ఏలూరుకు రోడ్లు అన్నాడు.. అవి ఇంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నారు కదా.. పోనీ ఒక్క కళాశాల అయినా కట్టాడా అంటే అదీ లేదు. చివరకు కేంద్రం రూ.480 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపిన ఎన్‌ఐటీ(నిట్)కు ప్రహరీ కూడా కట్టించలేదీ పెద్దమనిషి. తాడేపల్లిగూడేనికి నాన్నగారి హయాంలో రూ.68 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులనూ పూర్తి చేయలేదు. నాన్నగారు ఉన్నప్పుడే రూ.30 కోట్ల ఖర్చుతో పనులు చేపడితే మిగతావాటికి దిక్కులేదు.
రౌడీయిజంలో బాబు మాస్టర్ ట్రైనర్
చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు రౌడీయిజం, అవినీతి చేయడంలో బాగా శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్‌గా మారి మట్టి, ఇసుక, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, విశాఖ భూములు, గుడి భూములు.. తాజాగా తిరుమల తిరుపతి ఆలయ ఆభరణాలను దోచేస్తున్న స్థితికి తీసుకువచ్చారు. పైన మాస్టర్ ట్రైనర్‌గా బాబు దోచేస్తుంటే కింద ఆయన నియమించిన జన్మభూమి కమిటీలు మాఫియా ముఠాలుగా మారాయి. మీ జిల్లా కలెక్టర్ (పశ్చిమ గోదావరి) టీచర్లను ఉద్దేశించి ఏమన్నారో తెలుసా? టీచర్లంతా కదిలే శవాలట.. ఉపాధ్యాయుల గురించి ఎవరైనా నాలుగు మంచి మాటలు మాట్లాడతారు.. మీ జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన చంద్రబాబుకు బాగా క్లోజ్ (అత్యంత సన్నిహితుడు) అట. రాష్ట్రమంతటా కలెక్టర్లు మారినా ఈయన మాత్రం నాలుగేళ్లయినా మారడు. అవినీతిలో పేట్రేగిపోతున్నా ఆ కలెక్టర్ భుజాన చంద్రబాబు చేయి వేసి నడుస్తూ పోతుంటాడు. అదీ సీఎం తీరు.
కలెక్షన్ లెక్క కోసమే వారం వారం పోలవరం
పోలవరం పనులు చెక్ చేసే పేరిట పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రతి సోమవారం చంద్రబాబు ఎందుకు వస్తారో తెలుసా? పనుల తనికీ కోసం కాదు.. ‘నా కలెక్షన్ ఎంత?’ అని అడగడానికి మాత్రమే వస్తాడు. ఆ దివంగత నేత వైఎస్ హయాంలో మాత్రమే పోలవరం ముందుకు సాగింది. విభజన సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇస్తే ఈ పెద్దమనిషి (చంద్రబాబు) తన లంచాలు, కమీషన్ల కోసం ‘నేనే కడతా’ అని తీసుకున్నాడు. రేట్లు పెంచుకున్నాడు. నామినేషన్ పద్ధతిన తన బినామీ కాంట్రాక్టర్లను నియమించుకున్నారు. ఆ కాంట్రాక్టర్లలో మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు ఉన్నాడు. ‘ఈ ప్రాజెక్టులో 36 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి కావాల్సి ఉంటే నాలుగేల్లుగా కేవలం 6 లక్షల క్యూబిక్ మీటర్ల పనులే పూర్తయ్యాయన్నా.. ఇలా అయితే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నా?’ అని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం తన సమీక్షా సమావేశాల్లో 53 శాతం పనులు పూర్తయ్యాయని గొప్పగా చెబుతున్నారు. వాస్తవానికి ఇందులో (53 శాతంలో) 70 శాతం పనులు వైఎస్ హయాంలో పూర్తయ్యాయి. పోలవరం కుడి, ఎడమ కాలువలను వైఎస్ తవ్వించారు. అయితే చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పకుండా మోసం చేస్తున్నారు. మరో వైపు రైతులకు ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రాంతంలో పామాయిల్ రైతుల పరిస్థితి ఇంకా దారుణం. తెలంగాణలో టన్నుకు రూ.10 వేలకుపైగా వస్తుంటే ఏపీలో మాత్రం రూ.1000 తక్కువగా వస్తోంది. దళారీలను తీసేయ్యాల్సిన ముఖ్యమంత్రే దళారీ కావడం వల్లే ఈ దుస్థితి.
బాబు లంచాలకు పేదలు డబ్బు కట్టాలా?
ఇదే నియోజకవర్గంలో 59 ఎకరాల్లో పేదలకు ఇళ్లు కట్టాలని ఆవేళ వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఇప్పుడు ఆ స్థలాలను వెనక్కు లాక్కొని వాటిల్లో 300 చదరపు అడుగుల ఫ్లాట్లు కట్టించి వ్యాపారం చేస్తానంటున్నాడు. రూ.3 లక్షలు అయ్యే ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు అమ్ముతున్నాడు. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి లక్షన్నర చొప్పున మూడు లక్షలు ఇస్తాయట. మిగతా రూ.3 లక్షలను ఆ నిరుపేదలు 20 ఏళ్లపాటు నెలనెలా రూ.2 వేల చొప్పున కడుతూ పోవాలట. అందుకే నేను చెబుతున్నా.. ఆ ఫ్లాట్లను తీసుకోండి. మన ప్రభుత్వం రాగానే మిగతా ఆ రూ.3 లక్షల లోను పేదలు కట్టాల్సిన పని లేకుండా చేస్తాం. ఇదే నియోజకవర్గంలో రూ.158 కోట్లతో ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఉద్యాన వన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే దాని ఆలనా పాలనా ఎలా ఉందో కూడా చూసుకోవడం లేదు ఈ ముఖ్యమంత్రి. ఆ యూనివర్సిటీకి ఇంతవరకు వైస్ చాన్స్‌లర్‌ను నియమించలేదు. ఇంతకన్నా దారుణం ఉంటుందా?
బాబు చెప్పిందేమిటి? చేసిందేమిటి?
రైతుల వ్యవసాయ రుణాలు రూ.87, 612 కోట్లు మాఫీ కాలేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలూ మాఫీ కాలేదు. నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతీ ఇవ్వలేదు. ఏ ఒక్కరికీ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇన్ని మోసాలు, అన్యాయాలు చేసిన ఇలాంటి నాయకుడిని మీరు నమ్ముతారా? మీరు నమ్మరని.. ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్ కారు ఇస్తానంటారు. ఇవీ నమ్మరని తన మనుషులను పంపించి ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. ఆ డబ్బు వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసుకున్నదే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత తీసుకురావడానికి బయలు దేరిన మీ బిడ్డను ఆశీర్వదించండి’’ అని జగన్ అన్నారు.
బాబు మాదిరి అబద్ధాలు చెప్పలేను..
కాపులకు సంబంధించి కొందరు ఈ రోజు నావద్దకు వచ్చారు. అర్జీలు ఇస్తూ ఎలా మోసపోయారో వివరించారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా. నేనేదైనా చేయగలిగింది మాత్రమే చెప్పగలుగుతా. మిగిలినవి ఏవైనా కూడా ప్రయత్నం చేస్తానని మాత్రమే చెప్పగలుగుతా. చంద్రబాబు తరహాలో మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం నా చేతకాదు. ప్రతీ కాపు సోదరుడికి నేను కచ్చితంగా హామీ ఇస్తున్నా.. ప్రియతమ నేత దివంగత రాజశేఖరరెడ్డి గారు కాపుల గుండెల్లో ఏ విధంగా గూడు కట్టుకున్నారో.. అంతకన్నా ఎక్కువ స్థాయిలో నేను మీకు చేస్తానని హామీ ఇస్తున్నా. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఐదు వేల కోట్లు కాపు కార్పొరేషన్‌కు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లకు కలిపి కనీసం రూ.1100 కోట్లు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు చెప్పిందానికంటే రెట్టింపు ఇస్తానని ప్రతీ కాపు సోదరుడికీ చెబుతున్నా. ప్రతీ కులాన్ని, వర్గాన్నీ మోసం చేసిన ఈ వ్యక్తిని పొరపాటున కూడా మీరు క్షమించకండి.
మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం..
- వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.
- ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
- కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తాం.
- మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయిస్తాం.
- క్యాన్సర్ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం.
- ఆపరేషన్ పూర్తయ్యాక పనులు చేసుకోలేరు కాబట్టి వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో ఆర్థిక సాయం అందిస్తాం.


