కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు డ్రామాలు: వైఎస్‌ జగన్‌ | ys jagan criticises cm chandrababu on union budget | Sakshi
Sakshi News home page

Feb 3 2018 6:32 PM | Updated on Jul 25 2018 5:27 PM

ys jagan criticises cm chandrababu on union budget - Sakshi

సాక్షి, సౌత్‌మోపూర్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వమని, ఈ ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉందని, టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. టీడీపీ మంత్రులుగా ఉన్న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన తర్వాతే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, అయినా, ఈ బడ్జెట్‌లో తనకు తెలియకుండానే అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.

'కేంద్ర బడ్జెట్‌ను చూసి చంద్రబాబు చంద్రబాబు బాధపడ్డారట. వెంటనే కేంద్ర బడ్జెట్‌పై మంత్రులు, ఎంపీలతో మాట్లాడరట. ఈ విధంగా పేపర్లలో, టీవీలల్లో చంద్రబాబు ఇస్తున్న లీకులను చూసి ఆశ్చర్యం వేసింది. మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారా? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్‌ ఇది. ఇదే మొదటిసారి అన్నట్టు చంద్రబాబు బాధపడుతున్నారు' అని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

గత నాలుగేళ్లలో చంద్రబాబు ఏరోజూ మోదీని, బీజేపీని తిట్టలేదని, కానీ, గత రెండురోజులుగా మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ హడావిడి చేస్తున్నాడని విమర్శించారు. గతంలో ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు.. కేంద్రం ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ "కొడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?'అని చంద్రబాబు చెప్పలేదా? అని గుర్తు చేశారు. ఇన్నాళ్లు కేంద్రం గురించి ఏం మాట్లాడని చంద్రబాబు మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. ఎవరో ఒకరి మీద నెపం మోపి.. బండలు వేసి.. తాను తప్పించుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. అందుకే ప్రధాని మోదీని తిట్టే పనిని పెట్టుకున్నారని, పిల్లనిచ్చి పెళ్లి చేసిన సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి.. ప్రజలు, మోదీ ఓ లెక్కానా? అందుకే వారికీ వెన్నుపొటు పొడుస్తున్నారని మండిపడ్డారు.

గత నాలుగేళ్లుగా కేంద్రం దగ్గరుండి రాష్ట్రానికి ఏం రాకుండా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు బడ్జెట్‌ను చూసి బాధపడ్డానని చెప్పడం దారుణమని, ఆయన అంత అన్యాయస్తుడు ఇంకెవరూ ఉండరని అన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవిని అని ఊదరగొట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అంటూ మాటమార్చారని గుర్తుచేశారు. కేంద్రాన్ని హోదా అడగకుండా ఖూనీ చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని, కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ బాబు ఊదరగొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు టైంపాస్‌ కానప్పుడల్లా.. తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి విదేశాలకు వెళుతున్నారని, ఆయన వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ వస్తుందని, బుల్లెట్‌ ట్రెయిన్‌ వస్తుందని, ఎయిర్‌ బస్సు వస్తుందని మీడియాలో ఊదరగొడుతున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement