ఎన్నికలు ముగిశాక.. అప్పుడిక మనం మొదలుపెడదాం 

The Worst Talks Are a Group of Televisions Increase Crowds - Sakshi

సాక్షి, అమరావతి :‘‘ఆహా.. మన ఎలక్షన్లు మొదటివిడతే అయిపోవడం ఎంత లాభం తెలుసా?’’ అన్నాను నేను.  
‘‘ఏం లాభం.. ఎవరికి లాభం?’’ కాస్త ఘాటుగానే అడిగాడు మా రాంబాబు గాడు.  
‘‘అందరికీ’’ అన్నాను.  
‘‘ఎలా?’’ మళ్లీ రెట్టించాడు.  
‘‘ఎన్నికలు నెల రోజుల్లోనే అయిపోయాయనుకో.. ఇప్పటికి దాదాపు నాలుగు వారాలే టైమ్‌ ఉంది కాబట్టి.. సరిగ్గా ఏ 28 రోజులో బయట తిరిగితే చాలు. చూశావా ఎండలు ఎలా ఉన్నాయో? అదే మన షెడ్యూలు ఏ మే నెలలోనో ఉందనుకో.. అప్పుడు రెండు నెలల పాటు ఇటు నాయకులూ, అటు కార్యకర్తలూ అందరూ ఎండల్లో పొద్దస్తమానం తిరగలేక చచ్చేవారు. ఇక పార్టీల అధినేతలైతే అంతంత కాలం పాటు గొంతులు చించుకుంటూ ఉపన్యాసాలివ్వలేక బాధపడేవారు. వాళ్లకు.. నెల రోజుల్లో పెట్టాల్సిన ఖర్చులు రెణ్ణెల్ల పాటు పెట్టాల్సి వస్తే.. అది ఏ డబులో త్రిబులో అవుతుంది కదా. డబ్బు కోట్లలో వేస్టవుతుంది.. ఆలోచించు’’ అన్నాను.  
‘‘ఒరే పిచ్చి సన్నాసీ! ఎంతసేపూ నాయకుల కోణం నుంచి, వాళ్లకయ్యే ఖర్చుల కోణం నుంచి చూస్తావుగానీ.. కాసేపు అట్టడుగున ఉండే తాడిత పీడత జనాల వైపు నుంచి ఆలోచించవేమిట్రా’’ అన్నాడు రాంబాబు.  
‘‘ఎన్నికలు లేటుగా ఏ మే నెలలోనో జరిగితే వాళ్లకొచ్చే లాభం ఏమిటి?’’ అడిగాన్నేను.  
‘‘అమాయకుడా.. నువ్వు చెబుతున్న అణగారిన వర్గాల వారినే నాయకులు తమ వెంటేసుకుని ప్రచారాలకు తిప్పుతుంటారు. డోర్‌ టు డోర్‌ క్యాంపెయినింగు నిండుగా ఉండాలని.. చాలామందికి డబ్బులిచ్చి పిలిపించుకుంటుంటారు. ఇంత అర్లీగా ఎన్నికలు ముగిసిపోవడం అంటే అలాంటి వాళ్లందరి ఉపాధికీ గండి కొట్టినట్టేనని గ్రహించవేమిరా?’’  
‘‘నాకు అర్థం కాలేదు’’ అన్నాను.  
‘‘పిచ్చివాడా.. ఇప్పుడు నేతాశ్రీల వెంట వచ్చే కార్యకర్తలందరికీ పొద్దున్నే టిఫినూ, మధ్యానం బిర్యానీ, సాయంత్రం స్నాక్స్‌.. రాత్రికి మళ్లీ కోడిపలావ్‌ విత్‌ మందూ.. ఇవన్నీ జస్ట్‌ 28 రోజులే. అదే రెండు నెలల గడువుందనుకో.. పాపం.. వాళ్లందరికీ రెండు నెలల పాటు విందే విందు.. మందే మందు’’  
‘‘పోన్లే.. పాపం. కనీసం రెండు నెలలు తాగే ఆ చీప్‌ లిక్కర్‌ ఒక నెలే తాగుతారంటే ఆ మేరకు వాళ్ల హెల్త్‌ బాగుపడ్డట్టేగా’’ అన్నాను నేను.  
‘‘బాగుపడేది వాళ్లు కాదురా.. ఎన్నికలు మేలో జరిగితే కనీసం ఓటర్ల పంపకాలు రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరిగేవి. ఇప్పుడు కార్యకర్తలతో పాటు వాళ్లను బుజ్జగించాల్సిన సమయమూ కొద్దిగానే ఉంది.. ఓటరు దేవుళ్లంటూ వాళ్లను మునగచెట్లు ఎక్కించే వ్యవధీ తగ్గిపోయింది. కానీ బాగుపడేదెవరంటావా.. ఇక ఎలక్షన్‌ అయిన మర్నాటి నుంచి ఫలానా వారి సర్వే అనీ, ఫలానా వారి అంచనా అంటూ సెఫాలజిస్టులనే రాజకీయ జాతకాలు చెప్పేవాళ్లు టీవీల్లో కూర్చొని అదేపనిగా ఊదరగొట్టేస్తుంటారు. ఒక్కొక్కరి అంచనా ఒకలా ఉంటుంది. తమకు అనుకూలమైన అంచనాను పట్టుకొని ఒక పార్టీ వారు.. దాన్ని ఖండిస్తూ ఎదుటిపార్టీ వాళ్లూ టీవీ చర్చల్లో గొంతులూ.. బట్టలూ చించుకుంటుంటారు. వాళ్ల వాదనలు వింటూ బెట్టింగ్‌ రాయుళ్లు.. నెల రోజుల పాటు కాయాల్సినంత కాస్తూ నష్టపోతారు. ఏతావాతా బాగుపడేదెవరంటే.. ’’ నా మొహాన సుదీర్ఘంగా ఉపన్యాసమొకటి పడేస్తూ కాస్త గాలి పీల్చుకోడానికి ఆగాడు.  
‘‘ఎవర్రా’’ సస్పెన్స్‌ పట్టలేక అడిగేశా.  
‘‘ఇంకెవరూ.. చెత్త చర్చలతో తమ టీఆర్‌పీలు, జనాల బీపీలు పెంచే ఓ వర్గం టీవీ వాళ్లు’’ అంటూ అసలు విషయం కూల్‌గా చెప్పాడు మా రాంబాబుగాడు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top