‘ప్రపంచ రాజధాని’.. అంతా భ్రాంతియేనా..?

why did the Capital city of andhra Pradesh changed from Hydrabad to Amravati - Sakshi

సాక్షి, నెల్లూరు: సింగపూర్, బీజింగ్, టోక్యో, సియోల్, న్యూయార్క్, కొలంబో, దుబాయ్‌ ప్రతినిధులు ఇండియాలో ఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. అందరూ కాఫీ షాప్‌లో మాట్లాడుకుంటున్నారు. ఆ పక్క టేబుల్‌లో ఉన్నోళ్లు అమరావతి గురించి చర్చించుకుంటున్నారు. ‘అమరావతి న్యూయార్క్‌లా ఉంటుందని ఒకరు,    కాదు సింగపూర్‌లా ఉంటుందని మరొకరు.. ఇలా వారి మధ్య వాదులాట మొదలైంది.  
ఈ మాటలు ఆ దేశాల పౌరులు విని నోరెళ్లబెట్టారు. అసలు దీని సంగతేందో కనుక్కుందామని ఒక ట్రాన్స్‌లేటర్‌ని వెంట పెట్టుకుని ‘ప్రపంచ రాజధాని’కి వచ్చారు. అప్పుడే అక్కడ బాబోరు ప్రచారంలో ఉన్నారు. మైక్‌ పట్టుకుని ఆణిముత్యాలు వదులుతున్నారు. 
‘తమ్ముళ్లూ.. దిస్‌ ఈస్‌ నేను.. ఒకప్పుడు హైదరాబాద్‌ కట్టాను. ఇప్పుడు ప్రపంచానికి దిక్సూచిని నిర్మిస్తున్నా. సింధూ, హరప్పా నాగరికతల గురించి బుక్స్‌లో ఎలా చదువుకుంటున్నామో, భవిష్యత్‌ తరాలు కూడా అమరావతి నాగరికత గురించి రీడ్‌ చేయాలి. (తమ్ముళ్లూ.. నిరుత్సాహంగా ఉన్నారు. చప్పుట్లు కొట్టి హర్షధ్వానాలు చెప్పండి అంటూ బాబోరు అడిగి మరీ కొట్టించుకున్నారు) రాజధాని లేకుండా చేశారని నేనేమీ బాధపడలేదు. (సార్‌! బాధ డబ్బుల విషయంలో.. కేంద్రం ఓ రూ.25 వేల కోట్లు ఇచ్చుంటే బాగుండేది. ఎక్కువ భాగం మన అకౌంట్లో పడిపోయేదని సన్నిహితుల దగ్గిర ఎప్పుడూ అంటుండేవారని ఓ సీనియర్‌ నాయకుడు గుసగుసలాడాడు) వరల్డ్‌లోని బెస్ట్‌ క్యాపిటల్స్‌ని తలదన్నేలా అమరావతి నిర్మాణం మొదలెట్టా. అందుకోసం స్పెషల్‌ ఫ్లయిట్‌లో వెళ్లి 20 దేశాలు చూసొచ్చా. అక్కడున్న రాజధానుల కన్నా బెటర్‌గా అమరావతిని కట్టాలని ఆలోచన చేస్తున్నా. కాకపోతే మనది లోటు బడ్జెట్‌ కదా.. అందుకే కొంచెం లేట్‌ అవుతోంది. (అంతలో ఓ నాయకుడు కొంచెం కాదు.. జీవితకాలం లేట్‌ అని అన్నాడు కాస్త పెద్దగానే.. కాకపోతే బాబోరికి వినపడకుండా) ఇంకో పది, పదిహేనేళ్లు పట్టొచ్చు. కేంద్రం సహకరించడంలేదు. మనవాళ్లపై రైడ్స్‌ జరుగుతున్నాయ్‌. బాధగా ఉంది. మీరంతా నాకు రక్షణ వలయంగా ఉండాలి. అక్కలూ.. చెల్లెళ్లూ..! మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే..(ఇంతలో ఒకతను బాబోరి దగ్గరికెళ్లి చెవిలో.. సర్‌ టాపిక్‌ డైవర్ట్‌ అయింది అన్నాడు) బాబోరు వెంటనే తమాయించుకుని ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా ఇక్కడే ఉంది. (ప్రసంగం వింటున్న ఒకతను అందుకే డేటా చోరీ చేసి ఓట్లు తొలగించింది అన్నాడు పక్క వ్యక్తితో) నన్ను మళ్లీ గెలిపిస్తే ఒలింపిక్స్‌ జరిపిస్తా. అమరావతి ప్రారంభోత్సవానికి వందకు పైగా దేశాల అధ్యక్షులను తీసుకొస్తా.  అన్ని దేశాల రాజధానులకు  ఫ్లయిట్స్‌ వేయిస్తా’ అంటూ బాబోరు బుల్లెట్స్‌ వదులుతూనే ఉన్నారు.  
ఇదంతా ఆ విదేశీ ప్రతినిధులకు ట్రాన్స్‌లేటర్‌ తర్జుమా చేసి చెప్తుండగా వారంతా విని మూర్చపోయారు. 
– గోరంట్ల వెంకటేష్‌బాబు, నెల్లూరు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top