వంచనపై గర్జన దీక్ష | Sakshi
Sakshi News home page

అనంతపురంలో నేడు వంచనపై గర్జన దీక్ష 

Published Mon, Jul 2 2018 1:42 AM

Vanchanapai Garjana Deeksha in Anthappuram today - Sakshi

అనంతపురం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలో జరగనుంది. జూలై 2న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్‌ క్లాక్‌ సమీపంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో (ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా) జరిగే ఈ దీక్షకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్‌సభ సభ్యత్వాలను త్యాగం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

మూడో గర్జన 
ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సాగిస్తున్న కుట్రలను ఎండగట్టడానికి వైఎస్సార్‌సీపీ నేతలు తొలిసారిగా విశాఖపట్నంలో ఏప్రిల్‌ 29న వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహించారు. రెండోసారి జూన్‌ 2న నెల్లూరు జిల్లా కేంద్రంలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచడానికి మూడోసారి సోమవారం అనంతపురంలో వంచనపై గర్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. 

నాలుగేళ్లుగా అలుపెరుగని పోరు 
విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రగతి సాధించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలుగెత్తి చాటుతున్నారు. హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా, కుయుక్తులు పన్నుతున్నా లెక్కచేయకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతున్నారు. గుంటూరులో ఆయన చేపట్టిన అమరణ నిరాహార దీక్షను టీడీపీ ప్రభుత్వం భగ్నం చేసింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తూనే ఉంది.

ఈ క్రమంలో పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామా చేశారు. హోదా ఆకాంక్షను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించిన సీఎం చంద్రబాబు సైతం చివరకు యూటర్న్‌ తీసుకోక తప్పలేదు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, అధికారం అనుభవించిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఉద్యమం పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పోరాటంలోని అధర్మాన్ని, మోసాన్ని బహిర్గతం చేయడంతోపాటు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వంచనపై గర్జన దీక్షలు నిర్వహిస్తున్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

నల్ల దుస్తులతో దీక్ష 
అనంతపురంలో వంచనపై గర్జన నిరాహార దీక్షలో పాల్గొననున్న నేతలందరూ నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలపాలని వైఎస్సార్‌సీపీ సూచించింది. పార్టీ అగ్రనేతలు ఆదివారం రాత్రి నుంచే అనంతపురానికి చేరుకున్నారు. సోమవారం ఉదయానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు అనంతపురం చేరుకోనున్నారు.  

Advertisement
Advertisement