సీఎల్పీ రేసులో శ్రీధర్‌బాబు?

TPCC Would Elect Duddilla Sridhar Babu As CLP Leader - Sakshi

శాసన సభ వ్యవహారాల మంత్రిగా అనుభవం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నుంచి ఒకే ఒక్కడు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం

సమాలోచనలు చేస్తున్న టీపీసీసీ

సాక్షి, మంథని:  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.. ప్రభుత్వ విప్‌.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌ శానససభాపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతుంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను సీఎల్పీ ఉపనేత పదవి వరించింది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి మంథనికి సీఎల్పీ కేటాయిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజకవర్గంలోనే నిర్మాణంలో ఉండడంతో శాసన సభలో కాంగ్రెస్‌ తరఫున మాట్లాడే అవకాశం ఉండేలా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు సీఎల్పీ ఇస్తే బాగుంటుందనే ఆలోచన టీపీసీసీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్వర్గీయ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును నాడు నక్సల్స్‌ కాల్చి చంపగా ఆయన వారసత్వంగా శ్రీధర్‌బాబు రాజకీయ అరగ్రేటం చేశారు. మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఉన్నతవిద్య, పౌర సరఫరాల శాఖలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఏఐసీసీ మెంబర్‌గా, 2014లో మానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇలా పార్టీలో పదవులు చేపట్టి సీనియర్‌గా, అజాత శత్రువుగా పేరున్న శ్రీధర్‌బాబు అర్హతను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ గాలి వీచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా ఓడిపోయారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా, 10 స్థానాల్లో టీఆర్‌ఎస్, రామగుండంలో స్వతంత్ర ఎమ్మెల్యే గెలుపొందగా, మంథని నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు విజయం సాధించారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top