
విజయవాడ సిటీ: తమ పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత బుద్దా వెంకన్నను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను నిలదీసిన ఎమ్మెల్యే రోజాపై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. తమ ఎమ్మెల్యే రోజాపై కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. అదే జరిగితే చంద్రబాబు ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ తామూ కోడిగుడ్లతో దాడి చేస్తామని హెచ్చరించారు. బుద్దా వెంకన్న సభ్యతా సంస్కారాలతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా ఎమ్మెల్యే రోజా చేసిన పోరాటంతో సీఎం చంద్రబాబు సైతం ఆ బాలికను పరామర్శించాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
ప్రభుత్వాన్ని నిలదీశారని ఎమ్మెల్యే రోజాపై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. బుద్దా వెంకన్న చంద్రబాబు పాఠశాలలో చేరినప్పటి నుంచి రాజకీయ హుందాతనం లేకుండా మాట్లాడు తున్నాడని మండిపడ్డారు. మీ నాయకుడు లోకేష్ విదేశాల్లో మహిళలతో విచ్చలవిడిగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయని, ఇంట్లో పనమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు.