ఇది ప్రజా ఉద్యమాల వేదిక

Telangana jana samithi officeopening by chukka ramayya - Sakshi

చుక్కా రామయ్య చేతుల మీదుగా టీజేఎస్‌ కార్యాలయం ప్రారంభం

సమస్యల పరిష్కారానికి పోరాడేవారు సమావేశాలు పెట్టుకోవచ్చు: కోదండరాం

ఈ నెల 19, 20 తేదీల్లో పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) పార్టీ కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం పార్టీ కార్యక్రమాలకే కాకుండా ప్రజా ఉద్యమాలకూ వేదికగా ఉంటుందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ ఎత్తివేశాక వేదికలు లేకుండాపోయాయని, అయితే న్యాయపరమైన డిమాండ్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసే వారు వేదిక లేదని రంది పడాల్సిన అవసరం లేదని, టీజేఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులైనా మరెవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చని, ప్రజా ఉద్యమాల సమాహారమే జన సమితి పార్టీ అని పేర్కొన్నారు. నాంపల్లి కేర్‌ ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ కొత్త కార్యాలయాన్ని గురువారం మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఇప్పటికే అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ నెల 19, 20 తేదీల్లో పార్టీ రాజకీయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్‌ తదితర జిల్లాల వారికి 19వ తేదీన కరీంనగర్‌లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం తదితర జిల్లాల వారికి 20వ తేదీన వరంగల్‌లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఆ తర్వాత మిగతా జిల్లాల వారికి మహబూబ్‌నగర్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు.  

ఉద్యమ ఆకాంక్షల ధూంధాంకు మద్దతు
ఇతర ప్రజా సంఘాలు జూన్‌ 1న తలపెట్టిన ఉద్యమ ఆకాంక్షల ధూం ధాంకు తమ మద్దతు ఉంటుందని కోదండరాం అన్నారు. రైతు సమస్యలపై 31వ తేదీన ఖమ్మం నుంచి కరీంనగర్‌ వరకు తలపెట్టిన సడక్‌ బంద్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు.

రికార్డుల్లో దొర్లిన తప్పుల కారణంగా రూ.4 వేలు రావడం ఏమో కానీ చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారంలో టీజేఎస్‌ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. సెల్‌ఫోన్‌ ద్వారా పార్టీలో చేరే కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా 500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.  

కొత్త ఒరవడికి టీజేఎస్‌ నాంది
చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణలో కొత్త ఒరవడికి టీజేఎస్‌ నాంది పలకాలన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కోదండరాం ముందుకు వస్తున్నారన్నారు. గతంలో తాము కన్న కలలను సాకారం చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

ప్రస్తుత పరిస్థితులతో అమరవీరుల ఆత్మ ఘోషిస్తోందని, కాబట్టి టీజేఎస్‌ నేతలు చట్ట సభల్లో వారి తరపున మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, విద్యాధర్‌రెడ్డి, అంబటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top