దాసోజు శ్రవణ్‌కు ఖైరతాబాద్‌ | Sakshi
Sakshi News home page

దాసోజు శ్రవణ్‌కు ఖైరతాబాద్‌

Published Thu, Nov 15 2018 3:49 AM

Telangana Congress Candidates 2nd list release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు అదృష్టం దక్కింది. కాంగ్రెస్‌ గొంతుకగా, టీపీసీసీలో తెరవెనుక వ్యూహకర్తగా గుర్తింపు పొందిన శ్రవణ్‌కు ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలో శ్రవణ్‌తో పాటు మరో 9 మంది అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఇందులో చాలా మంది పాతకాపులే ఉన్నారు. జాబితాలో జాజుల సురేందర్‌ (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), కె.కె.మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్‌), రమేశ్‌రాథోడ్‌ (ఖానాపూర్‌), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (ధర్మపురి), విష్ణువర్ధన్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌), సి.ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్‌), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు) ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ బుధవారం నాటికి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది.

ఇందులో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే 33 ఓసీ, 15 బీసీ, 15 ఎస్సీ, 8 ఎస్టీ, 4 మైనార్టీలున్నారు. ఓసీల్లో 29 మంది రెడ్డి కులస్తులకు టికెట్లివ్వగా, ముగ్గురు వెలమలు, ఒక బ్రాహ్మణ నేతకు అవకాశం దక్కింది. బీసీల్లో అత్యధికంగా ఆరు స్థానాలు మున్నూరుకాపులకు కేటాయించారు. నాలుగు సీట్లు గౌడ్‌లకు, యాదవ, పద్మశాలి, విశ్వకర్మలకు ఒక్కోటి చొప్పున ఇచ్చారు. కాంగ్రెస్‌ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఇప్పటివరకు ప్రకటించినవి కాకుండా 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండటం, సామాజిక కోణంలో హైకమాండ్‌ ఈ స్థానాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పొన్నాలకు మొండిచేయి
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ భంగపాటే ఎదురైంది. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం, తాను ఆశిస్తున్న జనగామను టీజేఎస్‌కు కేటాయిస్తారన్న ప్రచారం జరగడంతో ఆయన మంగళవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, వయసు ఎక్కువ అయిందనే కారణంతోనే ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు రాహుల్‌ నిరాకరించారనే చర్చ జరుగుతోంది. పొన్నాల సేవలను పార్టీలో ప్రత్యేకంగా ఉపయోగించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రెబెల్స్‌ బెడద..
రెండో జాబితాలో ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి, మేడ్చల్, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో రెబెల్స్‌ బరి లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్‌ టికెట్‌ను ఆశించిన తోటకూర జంగయ్య యాదవ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానాపూర్‌ టికెట్‌ను రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ హరినాయక్‌ వర్గీయులు గాంధీభవన్‌లో ఏకంగా ఆమరణ దీక్షకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఎల్లారెడ్డి విషయంలో బీసీ కోటాలో సురేందర్‌ వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక్కడ టికెట్‌ ఆశించిన మరో నేత వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి రెబెల్‌గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన సుభాష్‌రెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకు న్నా అధిష్టానం మొండిచేయే చూపింది.
 

Advertisement
Advertisement