మేనిఫెస్టోపై టీడీపీ దోబూచులాట

TDP Yet To Release Manifesto - Sakshi

74 పేజీలతో సిద్ధం చేసినా విడుదల చేయకుండా జాప్యం

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో వస్తే కాపీ కొట్టే ఎత్తుగడ

ఇప్పటికే వైఎస్‌ జగన్‌ నవరత్నాలను కాపీ కొట్టిన బాబు

ప్రత్యర్థి మేనిఫెస్టో కోసం ఎదురుచూడడమేంటని పార్టీ సీనియర్ల అసంతృప్తి

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)ను విడుదల చేసే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దోబూచులాడుతున్నారు. ముసాయిదా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనా విడుదల చేయకుండా నాలుగు రోజుల నుంచి వాయిదా వేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని చూసుకుని మార్పులు చేసి తమ మేనిఫెస్టోను విడుదల చేయాలని చూస్తున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. అంటే వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను కాపీ కొట్టే ఉద్దేశంతోనే చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

యనమల రామకృష్ణుడు అధ్యక్షతన నెల రోజులక్రితం చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టో కమిటీని నియమించారు. మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు పెట్టాలో యనమల నిర్ణయించి.. దానిని మళ్లీ చంద్రబాబు సూచనల ప్రకారం మార్పులు చేసి 74 పేజీలతో ముసాయిదాను సిద్ధం చేశారు. 4 రోజుల క్రితమే దాన్ని బాబు విడుదల చేస్తారని టీడీపీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజూ వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారు. చివరికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేసేవరకూ తమ మేనిఫెస్టో విడుదల చేయకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే హామీలు, అంశాలుంటే నష్టపోతామని, కాబట్టి అది వచ్చాక దాన్నిబట్టి తమ మేనిఫెస్టోలో మార్పులు చేశాకే విడుదల చేయాలని నిర్ణయించారు.

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పటికే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టడం తెలిసిందే. వృద్ధాప్య ఫించన్‌ను రూ. 2 వేలు చేస్తామని జగన్‌ ప్రకటిస్తే దాన్ని ఎన్నికలకు 3 నెలలు ముందుగా హడావుడిగా అమలులోకి తెచ్చారు. రైతు భరోసా, ప్రతి కులానికి కార్పొరేషన్, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటిని కాపీ కొట్టారు. తాజాగా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని అధికారంలోకి రాగానే కేంద్రానికి లేఖ రాస్తామని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినట్లు లీకులివ్వడం గమనార్హం. కాగా పార్టీ వైఖరి ప్రకారం రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేయకుండా ప్రత్యర్థి మేనిఫెస్టో కోసం ఎదురు చూడడమేంటని టీడీపీలోని సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top