నిలదీత.. ఎదురీత

TDP Activists Atacking On Leaders Mini Mahanadu Guntur - Sakshi

మినీ మహానాడులో ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న కార్యకర్తలు

తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి

సమావేశాలకు ముఖం చాటేసిన తెలుగు తమ్ముళ్లు

భగ్గుమంటున్న విభేదాలు

సాక్షి, గుంటూరు: నిరసనలు.. నిలదీతలు.. టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు.. జనం లేక వెలవెల.. ఇది మొత్తంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు జరిగిన తీరు. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కార్యక్రమం చేపడితే నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారు. జిల్లాలో వారం రోజులుగా జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమాలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి. గ్రామాల నుంచి వాహనాల్లో జనాన్ని తరలించాల్సి వస్తోందని టీడీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన జనం కూడా కార్యక్రమం ముగియకముందే వెళ్లిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అయితే జన్మభూమి కార్యక్రమాల మాదిరిగా రేషన్‌ కార్డులు, ఇల్లు, పింఛన్లు మంజూరు చేస్తారని పుకారు పుట్టించి జనాన్ని సమీకరిస్తున్నారు. కార్యక్రమంలో నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం సొంత పార్టీ కార్యకర్తలే నిలదీస్తున్నారు. 

ప్రత్తిపాడులో గందరగోళం
టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా తమకు ఒరిగిందేమీ లేదంటూ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జరిగిన ప్రత్తిపాడు నియోజకవర్గ మినీ మహానాడు రసాభాసగా మారింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దివి శివరామ్‌ మాట్లాడుతూ పార్టీ వట్టిచెరుకూరు మండల అధ్యక్షుడిగా మన్నవ పూర్ణచంద్రరావు విజయానికి కృషి చేశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సభావేదికపైనే ఉన్న మన్నవ పూర్ణచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీ దానధర్మాలతో మాకు పదవులు రాలేదని, పార్టీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు పోలు కావడంతోనే వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో మన్నవ పూర్ణచంద్రరావు వర్గీయులు దివి శివరామ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వ్యతిరేక వర్గమైన మాజీ ఎంపీపీ పూనాటి రమేష్‌ వర్గీయులకు అనుకూలంగా దివి శివరామ్‌ వ్యవహరించారని విమర్శలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు జోక్యం చేసుకున్నా గొడవ సద్దుమణుగలేదు.

మంత్రి పుల్లారావుకు చేదు అనుభవం
జీవీ ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓ టీడీపీ కార్యకర్త సభలోనే నిలదీయడం కలకలం రేపింది. ఓ సామాజిక వర్గానికి తప్ప, కష్టపడేవారికి పదవులు దక్కడం లేదని కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ‘నువ్వు హీరో అనుకుంటున్నావా., పెద్ద మగాడిలా మాట్లాడుతున్నావ’ంటూ మండిపడ్డారు. సదరు టీడీపీ కార్యకర్త మంత్రిపై గొడవకు దిగడంతో పోలీసులు సభ నుంచి లాక్కెళ్లారు.

జనం లేక వెలవెల
రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి స్పందన కరువైంది. కార్యక్రమానికి వచ్చిన కొద్దిపాటి జనం కూడా లేచి వెళ్లిపోతుండటంతో త్వరగా ముగిద్దాం కూర్చోండంటూ మంత్రే స్వయంగా బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పెదకూరపాడు, గురజాల, మంగళగిరి వంటి నియోజకవర్గాల్లో సైతం కార్యక్రమాల వైపు ప్రజలు చూడలేదు. ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top