తొందరేముంది?

Straightforward question of opposition to the early election - Sakshi

ముందస్తు ఎన్నికలపై విపక్షాల సూటి ప్రశ్న

కేసీఆర్‌ చెప్పిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలొద్దు

కేంద్ర ఎన్నికల సంఘం కమిటీకి సూచన

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తా యో ప్రకటించడం అప్రజాస్వామికం. కేంద్ర ఎన్నికల సంఘం సైతం తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించడం దురదృష్టకరం. ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఇదా? కేసీఆర్‌ చెప్పినట్లు కాకుండా చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించుకోవడానికి 6 నెలల సమయముంది. తక్షణమే నిర్వహించాల్సిన అవసరమేంటి?’’అని విపక్ష పార్టీలు మండిపడ్డాయి.

వచ్చే నెల 10 లోగా ఓటర్ల జాబితా రూపకల్పన కోసం హడావుడిగా ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్‌ జారీ చేసిందని, మధ్యలో మొహర్రం, వినాయక చవితి పర్వదినాలు రానుండటంతో ఆశించిన మేరకు ఓటర్ల నమోదుకు స్పందన రాదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం  హైదరాబాద్‌ చేరుకుంది.

సచివాలయంలో రాత్రి వరకు 8 గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు, సలహాలు స్వీకరించింది.   ఏపీలో విలీనమైన ఏడు ముంపు మండలాల పరిస్థితి తదితర సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీఎస్పీ డిమాండ్‌ చేశాయి.  అనంతరం  రాజకీయ పార్టీల నేతలు విలేకరులతో మాట్లాడారు.  

కేసీఆర్‌ చెప్పినట్లు వద్దు: కాంగ్రెస్‌
ఎన్నికలు ఎప్పుడు రానున్నాయో కేసీఆర్‌ ప్రకటించడం, త్వరలో జరగాల్సిన 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో కాకుండా అంతకు ముందే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని వార్తలు రావడం అత్యంత దారుణమని కాంగ్రెస్‌ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి 3 నెలలైనా అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని, రాష్ట్రంలో ఎందుకు అంత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. 

కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం 4 వారాల్లో ఓటర్ల జాబితా రూపకల్పన సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వ్యక్తులందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఇందు కోసం పాత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాల ఓటర్ల విషయంతో తేల్చాలని, ఈ మేరకు నియోజకవర్గాల పునర్విభజన జరిపిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

త్వరగా నిర్వహించాలి: టీఆర్‌ఎస్, ఎంఐఎం
సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, టీఆర్‌ఎస్‌ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ కోరారు. మొహర్రం, వినాయక చవితి పండుగల ప్రభావం ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉండదని అసదుద్దీన్‌ స్పష్టం చేశారు. 2014 తరహాలో ఈసారి కూడా తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

4 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించే వరకు ఆగకుండా అంతకు ముందే నిర్వహించాలన్నారు. వినోద్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీకి కొంత మంది వలస వెళ్లడం, ఇతర కారణాలతో జాబితా నుంచి ఓట్లు తొలగించి ఉండవచ్చని, ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్‌ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పారని తెలిపారు.

రజత్‌ కుమార్‌తో కేంద్ర ఎన్నికల సంఘం కమిటీ భేటీ
డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి కమిటీ... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌ కుమార్‌తోపాటు వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను, ఎక్సైజ్, రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో సమావేశమై చర్చలు జరిపింది.

సంఘటనలను ఆరా తీయడంతోపాటు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా శాఖ ల సన్నద్ధతకు వివరాలను అడిగి తెలుసుకుంది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 4.15 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈ కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల కార్యదర్శులతో సమావేశం కానుంది.

ఓటర్ల నమోదు సాగడం లేదు..
చట్టప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ నేతలు చాడ వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి, కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. 2019 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల జాబితా రూపకల్పన చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతలు ఇంద్రసేనా రెడ్డి, మల్లారెడ్డి, వెంకట్‌ రెడ్డి కోరారు. గత ఎన్నికల్లో 2.83 కోట్లు ఉన్న ఓటర్లు తాజాగా ప్రకటించిన ముసాయిదా జాబితాలో 2.61 కోట్లకు ఎలా తగ్గారని సీపీఎం నేతలు డీజీ నర్సింగరావు, నంద్యాల నరసిం హా రెడ్డి ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ అన్నారు. కేసీఆర్‌ తన పరిమితులు దాటకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత రావుల సూచించారు.  బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ నేత సీహెచ్‌ మల్లన్న ప్రతిపాదించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top