సీఎం వాహనంపై రాళ్ల దాడి

Stone Thrown On Shivraj singh Chauhan Vehicle At Churhat - Sakshi

సిద్ధి(మధ్యప్రదేశ్‌): మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివరాజ్‌సింగ్‌ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం సిద్ధి జిల్లాలోని చుర్హట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమయంలో కొందరు దుండగులు ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా నల్లజెండాలను ప్రదర్శించారు. ఈ ఘటనపై చుర్హట్‌ పోలీస్‌ అధికారి బాబు చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో శివరాజ్‌సింగ్‌కు ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర విషయాలు వెల్లడించటానికి ఆయన ఆసక్తి కనబరచలేదు.

శివరాజ్‌ సింగ్‌ వాహనంపై దాడి జరిగిన చుర్హట్‌ ప్రాంతం ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అజయ్‌ సింగ్‌ నియోజకవర్గంలో ఉందని మధ్యప్రదేశ్‌ బీజేపీ అధికార ప్రతినిధి రాజ్‌నీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ దాడి కాంగ్రెస్‌ నేతలు చేసిందేనని ఆరోపించారు. తన బహిరంగ సభ అనంతరం శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అజయ్‌ సింగ్‌కు ధైర్యం ఉంటే బహిరంగంగా తలపడాలని సవాలు విసిరారు. తను శారీరకంగా బలహీనుడైనప్పటికీ.. రాష్ట్ర ప్రజలు తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఈ దాడితో తనకు గానీ, కాంగ్రెస్‌ పార్టీకి గానీ ఎటువంటి సంబంధం లేదని అజయ్‌ సింగ్‌ తెలిపారు. తమ పార్టీ ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడదని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక కుట్ర ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. తనను, చుర్హట్‌ ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top