వివాదాస్పదమైన టైట్లర్‌ హాజరు

Row Over Presence Of Jagdish Tytler At Sheila Dikshit's Takeover - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌ విభాగం అధ్యక్షురాలిగా షీలా దీక్షిత్‌ బాధ్యతలు స్వీకరించిన వేడుకకు ఆ పార్టీ సీనియర్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌ హాజరు కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల సాక్షులను బెదిరించేందుకే టైట్లర్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఆహ్వానించిందని శిరోమణి అకాళీదళ్‌ నేత, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ మజిందర్‌ సింగ్‌ సిర్సా మండిపడ్డారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉంచిన జగదీశ్‌ టైట్లర్‌ను షీలా దీక్షిత్‌ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించి ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని సిర్సా తీవ్రంగా విమర్శించారు.

‘‘1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో సాక్షులను జగదీశ్‌ టైట్లర్‌ భయపెట్టారన్న సంగతి బహిరంగ రహస్యమే. అటువంటి వ్యక్తికి కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఈ అల్లర్లకు సంబంధించి జగదీశ్‌ టైట్లర్‌ తోపాటుగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కూడా జైలు శిక్ష పడుతుంది. సిక్కు అల్లర్ల కేసులో సాక్షులను బెదిరించేందుకు, టైట్లర్‌కు అధిష్టానం మద్దతు మెండుగా ఉందన్న సందేశాన్ని తెలియచెప్పేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఇలా వ్యవహరించింది’’అని ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ విభాగం అధ్యక్షురాలిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ బుధవారం బాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నేతలు కరణ్‌సింగ్, జనార్దన్‌ ద్వివేది, మీరా కుమార్, పీసీ చాకో, సందీప్‌ దీక్షిత్, అజయ్‌ మాకెన్‌తో పాటుగా పార్టీ ఇతర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు.

అయితే జగదీశ్‌ టైట్లర్‌ను ఆహ్వానించడాన్ని షీలా దీక్షిత్‌ సమర్థించుకున్నారు. ‘ఆయన ఎందుకు రాకూడదు? ఆయనను ఇక్కడ మేము గౌరవించుకున్నామ’ని ఆమె వ్యాఖ్యానించారు. ఇందిర నుంచి రాహుల్‌ గాంధీ వరకు టైట్లర్‌ వారికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారని కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ పేర్కొన్నారు. దీన్ని బట్టే సిక్కుల పట్ల కాంగ్రెస్‌ వైఖరి అర్థమవుతుందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top