కేసీఆర్‌.. తేల్చుకుందాం రా!

Revanth Reddy Challenge to KCR In Malkajgiri Meeting - Sakshi

నాపై పోటీకి దిగు.. రేవంత్‌రెడ్డి సవాల్‌

మన్సూరాబాద్‌: ‘కాంగ్రెస్‌ మల్కాజిగిరి అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం వెతుకుతోంది. కేసీఆర్‌ నాకు నువ్వే పోటీ.. రా తేల్చుకుందాం’ అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. పార్టీ ఎల్‌బీనగర్‌ నియోజవర్గ ఎన్నికల కార్యాలయాన్ని మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. సీఎం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనపై 60 కేసులు పెట్టారని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, తాను సైనికాధిపతిగా ముందుండి నడిపిస్తానన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌... ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలే లేకుండా చేస్తున్నప్పుడు ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌లో గెలిచి పార్టీకి ద్రోహమా.?  
‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుధీర్‌రెడ్డి విజయానికి కృషి చేశాను. సమయం లేకున్నా వచ్చి ప్రచారం చేశాను. మల్కాజిగిరిలో రేవంత్‌రెడ్డి పోటీలో ఉంటేనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని నన్ను పోటీలో నిలిపాడు. తీరా అర్ధరాత్రి కారెక్కిపోయాడు. నేను నీకు ఏమీ అన్యాయం చేశాన’ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సుధీర్‌రెడ్డి కార్పొరేటర్‌గా, హుడా చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఎదిగాడంటే.. దానికి కాంగ్రెస్‌ పార్టీ కారణమన్నారు. అలాగే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు వీరిద్దరూ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌బీనగర్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అప్సర్‌బాయ్, కొప్పుల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాంరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా హస్తినాపురంలోని ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్‌›లో సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనూ రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అభిలాష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top