రేవంత్‌ రెడ్డి ఆరోపణలను ఖండించిన ఎల్‌ రమణ

Ramana Condemned Revanth Reddy Allegations

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని ఎల్‌ రమణ అంటున్నారు. రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణల ఖండించిన టీటీడీపీ చీఫ్‌ రమణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో స్టార్‌​ హోటళ్లలో నిర్వహించిన పార్టీ సమావేశాలకు రేవంత్‌ కూడా హాజరయ్యాడని.. అప్పుడు ఎవరు డబ్బులు పెట్టారని వచ్చాడంటూ ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ కబంధహస్తాల్లో ఇరుక్కుపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని, నిన్నటి సమావేశంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. డబ్బు కోసం చీకటి ఒప్పందాలు చేసుకునే రకం తాను కాదని ఈ సందర్భంగా రమణ తెలిపారు. ‘‘ఆర్థికంగా ఉన్న కుటుంబం మాది. నాపై ఆరోపణలు చేసే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు’’ అని రేవంత్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.  గతంలో ఎర్రబెల్లిపై ఆరోపణలు చేసిన సమయంలో తన కూతురిపై రేవంత్‌ ప్రమాణం చేసి మరీ తర్వాత గప్‌ చుప్‌ అయిపోయాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. 

ఇప్పుడు రేవంత్‌ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలనే తాము కోరుతున్నామని, అది జరిగేంత వరకు పార్టీ కార్యక్రమాలకు రేవంత్‌ను ఆహ్వనించమని రమణ స్పష్టం చేశారు.  ప్రస్తుతం తమ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారే ప్రభుత్వం తరపున పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు. తానెవరి దగ్గర రూపాయి తీసుకోలేదని.. తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచే పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, నేడు ఉదయం 11 గంటలకు లేక్‌వ్యూ గెస్ట్‌ హౌజ్‌లో చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకుంటామని రమణ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు రేవంత్‌ రెడ్డి హాజరుకావటంతో.. ప్రత్యేకంగా బాబుతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top