‘ఇప్పుడు ఐదుగురే.. రేపు 65 మంది’ 

Ram Madhav Hope On Government Form In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మతతత్వ, అవినీతి, రాచరిక, రాక్షస పాలనను అంతం చేయాలని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ ప్రజలను కోరారు. అవినీతి రహిత, కుంటుంబ పాలన లేని సుపరిపాలన కోరే వారందరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. శనివారం సికింద్రాబాద్‌ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమ్మేళననానికి హాజరైన ఆయన ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఐదుగురు ఎమ్మెల్యేల పార్టీగా ఉన్న తమకు అధికారం అప్పగించండి అని అనడానికి సంకోచంగా ఉండొచ్చని.. కానీ కురుక్షేత్ర మహా సంగ్రామంలో పంచ పాండవులే గెలిచారని కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అస్సాంలో కూడా అధికారంలోకి రాకముందు బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని అయినా ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ గత నాలుగున్నరేళ్లలో 15 రాష్ట్రాల్లో గెలిచిందని గుర్తు చేశారు. 

‘టీఆర్‌ఎస్‌ దివాలా తీసిన పార్టీ’
కాంగ్రెస్‌ కూటమిలో తెలుగు ద్రోహుల పార్టీ కూడా ఉందని ఎద్దేవ చేశారు. దివంగత ఎన్టీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెడితే.. ప్రస్తుత నాయకులు వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. అందుకే ఆ పార్టీ తెలుగు ద్రోహుల పార్టీగా మారిందన్నారు. ఇక కేం‍ద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చురకలు అంటించారు. తెలంగాణకు బీజేపీ మాత్రమే సహజమైన పార్టీ అని అభిప్రాయపడ్డారు. ఈ రోజు అయిదుగురు ఎమ్మెల్యేలే కావచ్చు.. కానీ రేపు 65 మంది ఎమ్మెల్యేలు అవుతారని జోస్యం చెప్పారు. మోదీ కేబినెట్‌లో దేశ గౌరవమైన పోస్టుల్లో ఇద్దరు మహిళా మంత్రులున్నారని.. కానీ తెలంగాణలో మహిళల స్థానం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని.. తెలంగాణలో బీజేపీలేని ప్రభుత్వం ఉండకూడదని కోరుకున్నారు. ఐదేళ్లు పరిపాలన చెయ్యలేక దివాళ తీసిన టీఆర్ఎస్‌ పార్టీకి మళ్లీ పరిపాలించే హక్కు ఉందా అంటూ రాంమాధవ్‌ ప్రశ్నించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top