అంబానీ గజదొంగ: రాహుల్‌

Rahul Gandhi Fire On BJP Over Ap Special Status - Sakshi

సాక్షి, కర్నూలు: ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడతానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏపీకి ఏమి చేయాలో ఆలోచించేవారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా మన్మోహన్‌ సింగ్‌ ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయిస్తే.. బీజేపీ పదేళ్లు కావాలని కోరిన విషయం గుర్తుచేశారు. కానీ అధికారం చేపట్టాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతే ఆంధ్రా గడ్డపై అడుగుపెడతానని, ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదా అమలుపై తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు. ప్రధాని ఎవరయినా ఏపీకి ప్రత్యేక హోదా శిరోధార్యం అంటూ వివరించారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇచ్చి తీరుతానని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

కర్నూలు నిజాయితి పరుల గడ్డ   
కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ ఆణిముత్యాలు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించాను. దేశంలో అవినీతి పెరిగినా దామోదరం సంజీవయ్య నిజాయితీగా పాలన చేశారు. నెహ్రూ హయాంలో సంజీవయ్య అవినీతి పరుడని కొందరు ముద్ర వేశారు. సంజీవయ్య తల్లి కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్న విషయాన్ని తెలుసుకొని నెహ్రూ సంజీవయ్యను ఏపికీ తొలి దళిత ముఖ్యమంత్రిని చేశారు. కర్నూలు నిజాయితి పరుల గడ్డ. కోట్లు విజయ భాస్కర్‌ రెడ్డి, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి లాంటి నాయకులను తయారు చేసేందుకే కర్నూలుకు వచ్చా.

విజయ్ మాల్య తొమ్మిది కోట్ల దొంగ అయితే అనిల్ అంబానీ 45 కోట్ల గజదొంగ
విజయ మాల్య 9 వేల కోట్ల కొల్లగొట్టి ఆర్ధిక మంత్రిని కలిసి లండన్ పారిపోయారు. విజయ మాల్య ఒక దొంగని దేశం మొత్తం తెలుసు. ఆర్ధిక శాఖ మంత్రి లంచాలు తీసుకుని విజయ్ మాల్యాను విడిచి పెట్టారు.  కాపలాదారుడిని అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ధిక శాఖ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలి. మోదీ ప్రధాని అయ్యాక రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్‌ను మార్చి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. విజయ్ మాల్య తొమ్మిది కోట్ల దొంగ అయితే అనిల్ అంబానీ 45 కోట్ల గజదొంగ. రాఫెల్ కుంభకోణంపై పార్లమెంటులో మోదీని ప్రశ్నిస్తే నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేక పోయారు. ఏపి ప్రజలు ప్రత్యేక హోదా అడిగితే మోదీ భూమి ఆకాశం వైపు చూస్తాడు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ. అన్ని వర్గాల వారు కలసి మెలసి ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకుంటుంది’ అంటూ రాహుల్‌ ఉపన్యసించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు పాలన గురించి రాహుల్‌ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు ఊహాగానాలకు మరింత బలం చేరుకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top