ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు | Rachamallu Siva Prasad Reddy Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు

Jun 5 2018 12:08 PM | Updated on Aug 20 2018 6:07 PM

Rachamallu Siva Prasad Reddy Fires On TDP Leaders - Sakshi

సీఎం ప్రారంభించేందుకు నిర్మిస్తున్న ఇంటి ఫొటోను చూపిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు

ప్రొద్దుటూరు టౌన్‌ :     ముఖ్యమంత్రి వస్తున్నారని ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తూ పోలీసుల తుపాకుల నీడలో చెన్నమరాజుపల్లె ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసమర్థ ప్రభుత్వం నడుస్తోందన్నారు. 2016లో చెన్నమరాజుపల్లె గ్రామానికి చెందిన దేవర సునీతకు ఎన్టీఆర్‌ స్వగృహ పథకం కింద ఇంటిని మంజూరు చేశారన్నారు. ఈ పథకం కింద రూ.లక్షా 50వేలు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. సీఎం చేతే ఇంటిని ప్రారంభించేందుకు అధికారులు ఇప్పుడు దగ్గర ఉండి పనులు చేయించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రెండేళ్లకుపైగా నిధులు విడుదల చేయకుండా అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో విద్యుత్‌ వైర్లు వేలాడుతున్నాయని, వాటిని మార్చాలని ఎమ్మెల్యేగా తాను ఇప్పటికి ఆ శాఖ అధికారులకు పది సార్లు చెప్పానని.. 50 వీధి దీపాలు, ఎస్సీ, ఎస్టీలకు 30 మీటర్లు ఇవ్వాలని చాలాసార్లు చెప్పానన్నారు.

సీఎం వస్తున్నారని...
నవనిర్మాణ దీక్షకు ముఖ్యమంత్రి వస్తున్నారని కొత్త పెళ్లి కూతురులా గ్రామాన్ని మారుస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఇక్కడ ఈ సౌకర్యాలు లేవనేది స్పష్టమవుతోందన్నారు. అమరావతిలో కూర్చొని ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నానని చెప్పే సీఎం ఒక్క సారి చెన్నమరాజుపల్లెలో ప్రజలు  చెప్పే బాధలను వినాలన్నారు. ప్రమాదకర పరిస్థితిలో విద్యార్థులు పాఠాలు అభ్యసిస్తున్నా ఏ శాఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. పైపై మెరుగులు చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం సక్రమంగా ఇవ్వాలన్నారు. ఈ విషయంపై తాను అసెంబ్లీలో మాట్లాడానని తెలిపారు.

ఇప్పటి వరకు ఏ అధికారైనా గ్రామాన్ని సందర్శించారా...
 ఇప్పటి వరకు ఏ అధికారి అయినా ఈ గ్రామానికి వచ్చారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.సీఎం వస్తున్నారని   వచ్చారే తప్ప గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కాదన్నారు. చెన్నమరాజుపల్లె, నాగాయపల్లె గ్రామాలకు సంబంధించి 67 ఎన్టీఆర్‌ గృహాలు మంజూరు చేశారని, ఇందులో 38 ఇళ్లు పూర్తయినా బిల్లులు ఇవ్వలేదన్నారు. ఈ రెండు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఒక్క ఎకరా భూమిని ఇవ్వలేదన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు  పర్యటనను పండుగ చేయాలని వరదరాజులరెడ్డి చెబుతున్నారన్నారు. వరద ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామ ప్రజల బాధలు ఒక్క సారైనా కనిపించలేదా అని ప్రశ్నించారు.

తుపాకుల నీడలో సీఎం పర్యటన
రెండు గ్రామాల్లో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి పర్యటనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల తుపాకుల నీడలో సీఎం రాకపోకలు జరుగుతున్నాయన్నారు. అధికారం, చట్టాన్ని ఉపయోగించి మాట్లాడే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం లేదన్నారు. ఎవరైనా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పొచ్చని జిల్లా కలెక్టర్‌ ప్రకటించాలని సవాల్‌ విసిరారు. కేసులు పెట్టమని చెప్పాలన్నారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ లీడర్లు ఫ్యాక్షనిస్టులు అంటూ పోలీసులను ఇప్పటికే గస్తీగా పెట్టారన్నారు. నడిపెన్న కొడుకు శ్రీనును పోలీసులు వెంబడిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి రాష్ట్ర నిధులు ఒక్క రూపాయిని అయినా మంజూరు చేశారా అని సీఎంను ఎమ్మెల్యే ప్రశ్నించారు.

మంచినీళ్లు తాగకుండా నిరసన
బలహీనమైన పనితీరును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. సీఎం ప్రొద్దుటూరులో అడుగు పెట్టిన నిమిషం నుంచి తిరిగి వెళ్లేంత వరకు మంచి నీళ్లు కూడా తాగకుండా నిరసన వ్యక్తం చేస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అని చెప్పి తన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలను కష్టాలపాలు చేశారన్నారు. గాంధీ మార్గంలోనే నిరసన తెలుపుతానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజుపాళెం మండల కన్వీనర్‌ ఎస్‌ఏ నారాయణరెడ్డి, సోములవారిపల్లె నాయకుడు శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement