ఆరుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ తాజా జాబితా విడుదల

R Krishniah gets Miryalaguda Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్‌. కృష్ణయ్యకు కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా మిర్యాల గూడ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. టీడీపీ ఎల్బీ నగర్‌ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్‌. కృష్ణయ్య ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆరుగురు సభ్యులతో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు చోటు కల్పించింది. కాంగ్రెస్‌తో కలసి పని చేసేందుకు సిద్ధమని కృష్ణయ్య గతంలోనే ప్రకటించినా అప్పట్లో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదు.

ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వాలని అనుకుంటే ఎల్బీ నగర్‌ లేదా తాండూరులో ఏదో ఒక స్థానాన్ని కేటాయించాలని ఆర్‌. కృష్ణయ్య కాంగ్రెస్‌ పెద్దల వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. బీసీలకు తక్కువ స్థానాలను కేటాయించామన్న అపవాదును పోగొట్టుకోవడంతోపాటు మడతపేచీ పడిన మిర్యాలగూడ సమస్యను పరిష్కరించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని కృష్ణయ్యకు కేటాయించిందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి. అయితే ఇదే స్థానానికి టీజేఎస్‌ కూడా విద్యాధర్‌రెడ్డికి బీ ఫారం ఇవ్వడం గమనార్హం.

తాజాగా కేటాయిం చిన ఆరింటితో కలుపుకొని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు 94 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించింది. తాజా జాబితాలో నలుగురు బీసీలకు అవకాశం లభించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకుగాను మహాకూటమి తరఫున ఇప్పటివరకు కాంగ్రెస్‌ 94, టీడీపీ 13, టీజేఎస్‌ 4, సీపీఐ 3 చోట్ల కలిపి 114 మంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. పటాన్‌చెరు, అంబర్‌పేట, వర్ధన్నపేట, హుజూరాబాద్, వరంగల్‌ ఈస్ట్‌ స్థానాల్లో కూటమి తరఫున 5 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.

కాంగ్రెస్‌ జాబితా..
మిర్యాలగూడ – ఆర్‌. కృష్ణయ్య (బీసీ)
సికింద్రాబాద్‌ – కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ (బీసీ)
నారాయణపేట్‌ – వామనగారి కృష్ణ (బీసీ)
నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌ (బీసీ)
కోరుట్ల – జువ్వాడి నర్సింగ్‌రావు (వెలమ)
దేవరకద్ర – డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి (రెడ్డి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top