అంతా ఆర్భాటం

Prnding Projects During Chandrababu Naidu Government In YSR Kadapa - Sakshi

సాక్షి కడప : అధికారంలోకి రాకమునుపు ఒక మాట.. వచ్చిన తర్వాత మరొక మాట చెబుతూ బాబు ముందుకు వెళుతున్నారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. పదిసార్లు అంతకన్నా కాదు.. దాదాపు 38సార్లు జిల్లాకు వచ్చినా.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ‘ఏరు దాటకమునుపు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా చంద్రబాబు వైఖరి ఉంటోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. జిల్లాకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ప్రకటించినా ఈనాటికీ రూపుదాల్చకపోవడం అందుకు బలం చేకూర్చుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికి కొన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రకటనలు తప్ప.. ప్రగతి కనిపించడంలేదు. ప్రత్యేకంగా వాటి నిర్మాణాల కోసం వేసిన శిలాఫలకాలు  శిథిలమవుతున్నాయే తప్ప.. వాటిని అమలు చేయకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది.

కనిపించని పర్యాటక సర్క్యూట్‌ 
జిల్లాలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయవచ్చు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామంటూ పలుమార్లు ఒంటిమిట్ట, గండికోటలకు సీఎం వచ్చిన సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఐదు పర్యాటక క్షేత్రాలను కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపలేదు. హామీలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ప్రతి సందర్భంలోనూ బాబు నోట సర్క్యూట్‌ మాట వస్తున్నా.. ఆచరణలో కనిపించకపోవడం విచారకరం. ఏళ్లు గడుస్తున్నా సర్క్యూట్‌కు మార్గం లేకపోవడంతో పర్యాటక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

 ఎక్కడా లేని కొండ లోయలు ఇక్కడే ఉన్నాయి. రెండు కొండ లోయల మధ్య పారే పెన్నా జలపాతం ఇక్కడి సొంతం. ఏదో ఇతర దేశాలలో తప్ప.. ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే గండికోటలో స్కై వాక్‌కు చర్యలు చేపడతాం.. పూర్తిస్థాయిలో గండికోటను అభివృద్ధి చేస్తామని గండికోటకు వచ్చిన సందర్భంలో చంద్రబాబు చెప్పారు. కానీ ఆ మాటలు అలాగే మిగిలిపోయాయి. ఈనాటికీ స్కై వాక్‌కు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. పైగా దాన్ని రోప్‌ వేగా మార్చి అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్పారు. అది కూడా ప్రతిపాదనలు మంజూరు దశలో ఉందే తప్ప.. కార్యరూపం దాల్చలేదు. అంతేకాదు గండికోటను ప్రపంచ చరిత్ర పటంలో నిలుపుతామంటూ పేర్కొన్న.. ఆర్కియాలజీ శాఖలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి చేయాల్సి ఉన్నా ఇంతవరకు గండికోటలో పరిస్థితి ‘ఎక్కడ వేసిన  గొంగళి అక్కడే’ అన్నట్లు తయారైంది.  

ఒంటిమిట్టలోనూ అంతంతే అభివృద్ధి.. 
రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అధికారికంగా ఒంటిమిట్టలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తామని చెప్పినా.. అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అప్పట్లో టీటీడీ ద్వారా రూ.100కోట్లు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినా.. ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. గత ఏడాది కల్యాణోత్సవం సందర్భంగా పెద్ద ప్రమాదం సంభవించిన విషయం అందరికి తెలిసిందే. అయినప్పటికి ఈనాటికి పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు.. బోటింగ్, ట్యాంక్‌ బండ్‌ తరహాలో ఉద్యానం, ఇతర మహనీయుల విగ్రహాలను కూడా పెట్టాలనుకున్నా రూపుదాల్చ లేదు. ఇళ్లు కోల్పోయిన వారికి గృహాలు, శ్రీరామ పంపింగ్‌ స్కీం మినహా మిగతా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. పర్యాటకం కూడా ఆశించిన మేర అభివృద్ధి చెందలేదనే చెప్పవచ్చు.   

శిలా ఫలకాలకే పరిమితం

బద్వేలు: పట్టణ పరిధిలోని తెలుగు గంగ కాలనీ వద్ద మంత్రి ఆదినారాయణరెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాలు దిష్టిబొమ్మను తలపిస్తున్నాయి. మున్సిపల్‌ కార్యాలయం నిర్మాణానికి రూ.2.50 కోట్లతో గత రెండు నెలల కిందట శిలాఫలకం వేశారు. దీంతోపాటు క్రిటికల్‌ ఇన్ఫ్ర్‌స్టక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ కింద నిర్మాణానికి రూ. రూ.37.91 కోట్లు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు, సిమెంట్‌ రోడ్డు నిర్మాణానికి రూ.3  కోట్లతో శిలాఫలకాలు వేశారు. అనంతరం కనీసం పునాదులు కూడా తీయలేదు. గత ఐదేళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి రూ.4 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదరాబాదరాగా రూ.42 కోట్లతో పనులు చేపడుతున్నట్లు శిలాఫలకాలు వేశారు. ఓట్ల కోసమే ఈ పాట్లు అని మున్సిపాలిటీ వాసులు చర్చించుకుంటున్నారు. 

కలగా మిగిలిన హార్టికల్చర్‌ హబ్‌.. 
రాయలసీమలో ఉద్యాన పంటలకు తిరుగులేదు. ప్రధానంగా జిల్లాలో పండ్ల తోటలకు పెట్టింది పేరు. ఉద్యాన హబ్‌గా మారుస్తామంటూ ఒక్కసారి కాదు.. వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నోటి నుంచి వెలువడే హామీల్లో ఇది ఒకటి. కానీ ఇంతవరకు ఉద్యాన హబ్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు కనిపించడంలేదు. పైగా ఎక్కడ పెడతారన్నది కూడా ప్రశ్నార్థకమే. దాదాపు ఐదేళ్లుగా జిల్లాలో ఎక్కడ సీఎం సభలు జరిగినా కచ్చితంగా బాబు నోటి నుంచి ఉద్యానహబ్‌ మాట వస్తూనే ఉంది. ఇంతవరకు అతీ.. గతిలేదు. అంతేకాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ మాట హామీ ఇచ్చినా.. అది కూడా హామికే పరిమితమైంది తప్ప.. అమలుకు నోచుకోలేదు. పండ్ల ఉత్పత్తులకు సంబంధించి కూడా పలుచోట్ల కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణాలు చేపడతామన్నా వాటి రూపు లేదు. మొత్తానికి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని చెప్పక తప్పదు. 

బాబు మాట... నీటి మూట..
రాయచోటి: జిల్లాలోని రాయచోటి, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని పీలేరు, వాయల్పాడు ప్రాంతాలకు హంద్రీనీవా నీరిచ్చి తీరుతా అంటూ ముఖ్యమంత్రి  చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. వైఎస్సార్‌ జిల్లా చిన్నమండెం మండల సమీపంలోని కలిబండ వద్ద జిల్లాలోకి హంద్రీ–నీవా ప్రాజెక్టు అడుగులు వేసేలా నాడు ఆ మహానేత వైఎస్సార్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పనులను కూడా వేగవంతం చేసి ముందుకు నడిపించి 80 శాతం వరకు పూర్తి చేయించారు. ఆయన హఠాన్మరణంతో పనులలో వేగం తగ్గింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో 90 శాతం పూర్తయి నీటి రాక కోసం ఎదురు చూస్తోంది.

ఈ ప్రాజెక్టుతోనైనా తమ కరువు ప్రాంతంలో నీరు పారుతుందని ఆశించిన జిల్లా రైతులకు నిరాశే ఎదురైంది. 2015 సంవత్సరంలో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డిలు హంద్రీ–నీవా ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వారి స్పందనపై నోరు తెరిచిన బాబు అసెంబ్లీలోనే 2016 కల్లా హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను కడప జిల్లాలో పారిస్తానన్నారు. ఆ మాటలు నేటికి అమలుకు నోచుకోలేదు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంపై ఉన్న ప్రేమ అనంతపురం జిల్లాలోని కదిరి, కడప జిల్లాలపై లేదని మరోమారు నిరూపితమైంది.    

నెరవేరని బాబు హామీలు
రైల్వేకోడూరు అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలకు రైల్వేఅండ్‌బ్రిడ్జి, బైపాసురోడ్డు, కోడూరు–వెంకటగిరి రోడ్డు, కోల్డ్‌స్టోరేజి, హార్టికల్చర్‌ హబ్,  ఉద్యాన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. 

ఆసుపత్రులకు వెళ్లాలంటే నరకయాతన 

నాపేరు తిరుపతి శేఖర్‌. మా ఊరు బుడుగుంటపల్లి, పట్టణానికి దగ్గరలోనే మా గ్రామం ఉంది. అత్యవసర సమయాల్లో పట్టణానికి రావాలన్నా, తిరిగి వెళ్లాలన్నాæ మధ్యలో  రైలు పట్టాలు ఉన్నాయి. రైలు పట్టాల ఆవలి వైపు 40 గ్రామాలు ఉన్నాయి. ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రులకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. ఇక్కడ రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మించాలని పోరాడుతున్నా బాబు ప్రభుత్వంలో స్పందన లేదు .

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం 

నాపేరు పర్వత విజయకుమార్‌రెడ్డి. మాది కోడూరు పట్టణం. గతంలో ఎన్నో ప్రభుత్వాల పరిపాలన చూశా. చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారు. ఈ ప్రాంతంలో రైతుల ప్రధాన సమస్య కోల్డ్‌స్టోరేజి గురించి పట్టించుకోలేదు. 

సర్వరాయసాగర్‌ పనుల్లో జాప్యం

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుచి సర్వరాయ సాగర్‌ ప్రాజెక్టు పనుల నిర్వహణలో జాప్యం జరుగుతూనే వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 75శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు పనుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తూ రావడంతో నేటికీ పనులు పూర్తి కాలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే పూర్తవుతుందని ఆశిస్తున్నాం.– ఎన్‌ విశ్వనాథరెడ్డి, గడ్డంవారిపల్లె, వీరపునాయునిపల్లె మండలం  

పది నెలలుగా అతీగతీ లేదు

ప్రొద్దుటూరు టౌన్‌ :     ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె, నాగాయపల్లె గ్రామాల్లో 2018 జూన్‌ 6వ తేదీన  నవనిర్మాణదీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అయితే ఏ ఒక్కటీ పూర్తి కాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాగాయపల్లె గ్రామంలో రూ.9.75 లక్షల అంచనాలతో పాఠశాల ప్రహరీ, వంటగది నిర్మాణ పనులను ప్రారంభించారు.  అయితే మధ్యలోనే పనులు ఆగిపోయాయి. గత ఏడాది వినాయకచవితి పండుగ రోజున కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి గుంతలు తీసి మూడు నెలలు అలాగే వదిలేశారు. ప్రసుత్తం కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి బెడ్‌ వేసి పిల్లర్లు ఏర్పాటు చేసి వదిలేశారు. పాఠశాలలో వంటగది నిర్మాణం కూడా ఇంత వరకు పూర్తి కాలేదు. 

పూర్తి కాని తారురోడ్డు పనులు...
రూ.199 లక్షలతో ప్రొద్దుటూరు నుంచి చెన్నమరాజుపల్లె మీదుగా దువ్వూరు, కర్నూలు జిల్లా  చాగలమర్రి వరకు నిర్మించాల్సిన తారురోడ్డు పనులు ఇంత వరకు పురోగతి సాధించలేదు. ఈ విధంగా సీఎం చంద్రబాబు రూ.4.22 కోట్ల పనులకు శిలాఫలకాలు  ప్రారంభించారే కానీ పనులు పూర్తిచేయలేదు. 

ఎన్నికల ముందు తొందర.. పాలనంతా చిందర వందర

కడప కార్పొరేషన్‌: నాలుగున్నరేళ్లు ప్రజా సంక్షేమం గాలికొదిలేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాలకు చక్కర్లు కొడుతూ గాలిలో గ్రాఫిక్స్‌ మేడలు కట్టారు. ముందే అన్నీ చేసేస్తే ప్రజలు మర్చిపోతారని, ఎన్నికల ముందు చేస్తే గుర్తుంచుకొని ఓట్లేస్తారని భావించారు. ఈ మేరకు ఎన్‌టీఆర్‌ గృహాలు, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, పసుపు, కుంకుమ, అన్న క్యాంటీన్లు, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)...ఇలా అన్నీ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందే చేయాలనే తొందరలో ఏవీ పూర్తి చేయలేక చతికిలబడ్డారు. ఫలితంగా పరిపాలనను చిందర వందరగా మార్చారు.  

కాలువలో పడి ప్రమాదాలు 
రూ.157.50 లక్షలతో నాగాయపల్లె, చెన్నమరాజుపల్లెల్లో ఏర్పాటు చేయాల్సిన కాలువల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడ నిలిపేసి నెలలు గడుస్తోంది.  కాలువను చాలా లోతుగా తీయడంతో చిన్న పిల్లలు, మూగ జీవాలు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నాయి. కాలువల నిర్మాణ సమయంలో 6 నెలల కిందట తాగునీటి కుళాయిలన్నీ ధ్వంసం చేయడంతో మంచి నీళ్ల కోసం కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రూ.39.15 లక్షలతో రెండు గ్రామాల్లో ఇంటర్నల్‌ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు శిలాఫలకం ఆవిష్కరించారే తప్ప పనులు పూర్తి కాలేదు.  

శిలాఫలకంతో సరి
జమ్మలమడుగు:  రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు హామీని కేంద్రం ద్వారా అమలు చేయించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలయ్యారు. నాలుగేళ్ల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకుని తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద మూడు వేల ఎకరాల భూమిలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటూ శంకుస్థాపన చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి  చంద్రబాబు  స్వయంగా శిలాఫలకం వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత  ఆ పనుల గురించి పట్టించుకోకపోవడంతో పనులు ఒక ఇంచి కూడాముందుకు సాగలేదు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top