ఈ నెలంతా రాజకీయ వేడి!

Political atmosphere across the country - Sakshi

రెండోవారంలో థర్డ్‌ఫ్రంట్‌ భేటీ!  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 4 రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు, కూటములతో సెప్టెంబర్‌ అంతా రాజకీయ సెగలుకక్కనుంది. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ ఇతర ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయత్నాలకు పదును పెట్టబోతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. సెప్టెంబర్‌ 9–10 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ భేటీలో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల ఎన్నికలకు సంబంధించి కీలక చర్చ జరగే వీలుంది.  

కత్తులు నూరుతున్న కాంగ్రెస్‌
రాఫెల్‌ ఒప్పందంపై దేశవ్యాప్తంగా 90 నగరాలు, పట్టణాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతతో ‘జన్‌ఆక్రోశ్‌’ ర్యాలీలు  నిర్వహించనున్నారు. నిరుద్యోగం, విద్య, మహిళా భద్రత తదితర అంశాలపై బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఒకరు తెలిపారు. సెప్టెంబర్‌ 17న రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ తర్వాతే పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 230 సీట్ల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బీఎస్పీకి 25 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో భావసారూప్యత ఉన్న పార్టీల ‘థర్డ్‌ ఫ్రంట్‌’ భేటీ సెప్టెంబర్‌ రెండో వారంలో జరగొచ్చని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top