ప్రతీ పైసా లబ్ధిదారుడికే

PM Modi in Odisha, begins work on Rs 13,000 crore Talcher fertiliser plant revival - Sakshi

ఓటు బ్యాంకు కోసం పథకాలు అమలు చేయడం లేదు

ఛత్తీస్‌గఢ్, ఒడిశా బహిరంగ సభల్లో ప్రధాని మోదీ

ఒడిశాలో రూ.13 వేల కోట్లతో ఎరువుల ప్లాంటు ప్రారంభం

తాల్చేర్‌/ఝార్సుగూడ/జాంజగీర్‌–చంపా: కాంగ్రెస్‌ హయాంలో పథకాల అమల్లో అవినీతి చోటుచేసుకుందని, ఇప్పుడు ప్రతీ పైసా పేదలకు అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కారు నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దాదాపుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.   

‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌’ లక్ష్యంతో ముందుకు..
‘నక్సలైట్లు, పేలుళ్లు, రక్తపాతానికి పేరుపడ్డ ఛత్తీస్‌గఢ్‌.. బీజేపీ హయాంలో అన్ని సవాళ్లను అధిగమించింది. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాల నడుమ స్థానాన్ని సంపాదించుకుంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రాలకు అందే నిధులు సక్రమంగా ఖర్చయ్యేవి కాదని, ఇప్పుడు ప్రతీ పైసా లబ్ధిదారుడికి చేరుతోందని అన్నారు. ‘ఎన్నికల్లో గెలుపు కోసమో లేదా ఓటు బ్యాంకు కోసమో పథకాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఓటు బ్యాంకు కోసం కాకుండా అందరి లబ్ధికే మా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రంలో రూ. 1607 కోట్లతో నిర్మించనున్న బిలాస్‌పూర్‌–పత్రపాలి రహదారికి, రూ. 1,697 కోట్లతో బిలాస్‌పూర్‌–అనుప్పుర్‌ మూడో రైల్వే లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.  

నవీన్‌ పట్నాయక్‌కు విజ్ఞప్తి
ఒడిశాలోని తాల్చేర్‌లో రూ.13 వేల కోట్ల ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ‘ఆయుష్మాన్‌ భారత్‌తో ఒడిశా ప్రజల్ని అనుసంధానం చేయాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద ప్రజలు పథకం లబ్ధిని కోల్పోతారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న బిజూ స్వాస్థ్య కల్యాణ్‌ యోజన పథకమే మెరుగైనదిగా పేర్కొంటూ ఆయుష్మాన్‌ భారత్‌లో ఒడిశా చేరలేదు.

వచ్చే ఏడాది ఒడిశాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పర్సంటేజ్, కమిషన్‌ల రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఝార్సుగూడలో వీర్‌ సురేంద్ర సాయ్‌ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. డబ్బులివ్వకపోతే మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకే చేరడం లేదని విమర్శించారు.  తాల్చేర్‌ ఎరువుల కర్మాగారంలో బొగ్గు నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్‌ ద్వారా వేపపూతతో కూడిన యూరియాను తయారుచేస్తారు.

మోదీకి అరటి శాలువా
జాంజగీర్‌ సభలో ప్రధాని మోదీకి స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు అరటి, అవిసె చెట్ల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన జాకెట్, శాలువాను బహూకరించారు. ఆ జాకెట్‌ ధరించే సభలో మోదీ ప్రసంగించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top