మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా!

People Pulse Survey: Regional Parties Again Rising in India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2014, లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా విజయఢంకా మోగిస్తూ 19 రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా వల్ల వరుసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోయాయి. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోక తప్పలేదు. ఈ పరిణామాలతో బీజేపీ అధికారం ప్రస్తుతం 13 రాష్ట్రాలకే పరిమితం అయింది.

ప్రాంతీయ పార్టీల విజయంతో శరద్‌ పవార్, భూపిందర్‌ హూడా, హేమంత్‌ సోరెన్‌లు తిరుగులేని నాయకులుగా తెరమీదకు రాగా, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయంతో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ పార్టీ అద్భుత విజయంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుగులేని ప్రాంతీయ నాయకులుగా చరిత్ర సృష్టించారు. అదే కోవలో ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్‌ను విజయ పథాన నడిపించడం ద్వారా అరవింద్‌ కేజ్రివాల్‌ బలమైన ప్రాంతీయ నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎన్నికల విశ్లేషణా సంస్థ ‘పీపుల్స్‌ పల్స్‌’ అంచనా వేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top