ఈవీఎంలు ఎక్కడ రిపేరు చేస్తున్నారు? | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 3:44 PM

Opposition Asks Election Commission Where Do You Repair EVMs - Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం)లను ఎక్కడ రిపేరు చేయిస్తున్నారో తెలుపాలని ప్రతిపక్షపార్టీలు, జాతీయ ఎన్నికల కమిషన్‌ను నిలదీశాయి. సోమవారం ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన సీఈసీ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రశ్నించారు. ప్రతిసారీ ఓట్లన్నీ ఒకే పార్టీకి ఎలా వెళ్తున్నాయని, వాటి రిపేరు చేసే సంస్థ పేరు, అడ్రస్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఎన్నిరోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

బీజేపీ మినహా కాంగ్రెస్‌, తృణముల్‌ కాంగ్రెస్‌, మాయవతి బహుజన సమజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, శరద్‌ పవార్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌లతో సుమారు 51 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించడం వల్ల ప్రజల తీర్పు వెలవడటం లేదన్నారు. ‘చాలా సందర్భాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారు. ఏ పార్టీకి ఓటేసిన ఒకే పార్టీకి ఓట్లు వెళ్లాయి. ఈవీఎంలను ఎవరు రిపేరు చేస్తారు? ఎన్ని రోజుల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు? అనే విషయం మాకు తెలియాలి. అలాగే ఓటరు రశీదు పరికరాలు (వీవీ ప్యాట్‌లు) ఉపయోగించాలని డిమాండ్‌ చేస్తున్నాం.’అని తెలిపారు. తృణముల్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. మాకు ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్‌ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈవీఎంలకు  ‘వీవీ ప్యాట్‌’ (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ అడిట్‌ ట్రైయిల్‌) అనుసంధానించి ప్రతి ఓటరు పేపర్‌ రశీదుతో ఒక శాతం ఓట్లను క్రాస్‌ చెక్‌ చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు 30 శాతం ఓట్లను క్రాస్‌చెక్‌ చేయాలని సూచించాయి. 

దేశంలో జరిగిన గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌  ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి మెజార్టీ రావడాన్ని ప్రతిపక్షపార్టీలు సందేహించాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే బీజేపీ అధికారం దక్కించుకుందని ఆరోపించాయి. అలాంటిదేం జరిగలేదని ఎన్నికల కమిషన్‌  వివరణ ఇచ్చినప్పటికి వారు నమ్మలేదు. 

Advertisement
 
Advertisement