ఎన్టీఆర్‌ పేరు చెడగొట్టను: కేటీఆర్‌

Never Damage NTR Reputation says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సరైన అవగాహన కల్పిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బసవతారకం ఇండో క్యాన్సర్‌ హాస్పటల్‌లో ఏర్పాటు చేసిన అడ్వాన్సు బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ యూనిట్‌ను ఆయన  గురువారం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ బసవతారకం హాస్పటల్‌ ఆవరణలో నైట్‌ షెల్టర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

‘క్యాన్సర్‌ అవగాహన కల్పించేందుకు బాలకృష్ణకన్నా పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరూ లేరు. నేను ఆయన అభిమానిని. ఎన్టీఆర్‌ పేరు నిలబెడతా, ఆయన పేరును చెడగొట్టే పనులు ఎప్పటికీ చెయ్యను’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. (ఎన్టీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎనలేని అభిమానం. ఆయనపై ఉన్న అభిమానంతోనే తన కుమారుడు కేటీఆర్‌కు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు). బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవల గురించి తన తల్లి ఎప్పుడూ చెబుతుండేవారని కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, అవసరం అయినవారు దీన్ని ఉపయోగించుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

                                             కార్యక్రమంలోని ఓ దృశ్యం

ఆస్తి పన్ను రద్దు సంతోషకరం..
బసవతారకం ట్రస్ట్‌కు రూ.6కోట్ల ఆస్తిపన్నును జీహెచ్‌ఎంసీ రద్దు చేయడం సంతోషకరమని  హాస్పటల్‌ చైర్మన్‌  బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో క్యాన్సర్‌ హాస్పటల్‌ గురించి కూడా ఉంటుందని తెలిపారు. నాన్నగారి పేరునే కేటీఆర్‌కు పెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా అన్ని ట్రస్ట్‌లకు ఆస్తిపన్ను మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top