
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ కూటమి పాలనలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్ కావాలంటే అన్ని అర్హతలున్నా చేయి తడపందే పనికాని దుస్థితి. సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాలివీ..
హిందూపురం మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఏమంత కష్టం వచ్చిందమ్మా’ అని అడిగితే పింఛన్ కోసం రూ.10 వేలు డబ్బులడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పి రూ.6 వేలకు ఒప్పించుకున్నానని మహిళ బదులిచ్చింది.
ఈ డబ్బు కూడా తనవద్ద లేక చెవికమ్మలు తాకట్టు పెడుతున్నానని చెప్పింది. లంచం ఎవరడిగారని దుకాణం యజమాని ప్రశ్నించగా.. ‘మోడల్ కాలనీ సచివాలయంలో డబ్బు అడిగారు. ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పారు.. అందుకే సామీ కమ్మలు తాకట్టుపెడుతన్నా’.. అంటూ ఆ మహిళ నిట్టూర్చింది.
ఈ సంభాషణంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌చేయడంతో ఈ అంశం వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, నియోజకవర్గంపై పర్యవేక్షణ లేకపోవడంతో టీడీపీ నేతలు, కొందరు అధికారులు పేదలను పీల్చి పిప్పిచేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఎటువంటి లంచాలు లేకుండానే అప్పట్లో నేరుగా ఇంటివద్దే సేవలు అందేవని.. ఇప్పుడు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని వారు దుమ్మెత్తిపోస్తున్నారు.
