అది మోసపూరితం : కల్వకుంట్ల కవిత

MP Kavitha Comments Over BJP And Congress - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఎన్నికల ముందు కిసాన్ సమ్మాన్ లాంటి పథకాలు ప్రకటించడం మోసపూరితమని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కేంద్రం రైతు బంధు, రైతు భీమా పథకాలను కాపీ కొట్టిందని ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ పేదలకు నెలకింత అని ఇస్తారట.. నానమ్మ(ఇందిరాగాంధీ) పేదరిక నిర్మూలనకు కృషి చేస్తే.. ఆయన దానికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీలు వద్దు.. లోకల్ పార్టీలు ముద్దు అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యమన్నారు.

అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. విభజన హామీలపై బీజేపీతో కొట్లాడామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉంటే.. ఆ సంఖ్య పెంచమని కేంద్రం చుట్టూ తిరిగామన్నారు. హక్కు భుక్తంగా రావాల్సిన ఎయిమ్స్‌ను ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నామని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే.. ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి ఆ పార్టీలు అంటూ విమర్శించారు. వాళ్లు చేసిందేమీ లేదు కాబట్టి, వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మందిరం, మసీద్, బోఫోర్స్, రాఫెల్ అంశాలను తెరపైకి తీసుకు వస్తున్నారన్నారు. ఇప్పుడు 16 టీఆర్ఎస్ 1 ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే.. సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. 19న నిజామాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు కార్యకర్తలు తరలి రానున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top