టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

MLA DK Aruna Criticize CM KCR - Sakshi

గద్వాల: మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌ నాయకులకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎస్‌వీ ఈవెంట్‌ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ గట్టు మండల కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన సీఎం కేసీఆర్, ఓటమి భయంతో కాంగ్రెస్‌ నాయకులపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య తదితర హామీలకే దిక్కులేదని విమర్శించారు. ఇవి చాలవన్నట్టు తాజాగా గద్వాల ప్రజలను మోసిగించే విధంగా హామీలు గుప్పించారని మండిపడ్డారు. గద్వాల అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఒక్క రోజులోనే విడుదల చేస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

జూరాల ప్రాజెక్టు దగ్గర బృందావన్‌ గార్డెన్, గుర్రంగడ్డ బ్రిడ్జి రెండు నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించి గద్వాల ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గట్టు లిఫ్టు డిజైన్‌ మార్పు పేరుతో సీఎం కేసీఆర్‌ మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపడితే ఎమ్మెల్యేకు పేరొస్తుందనే ఉద్దేశంతోనే రూ.వెయ్యి కోట్లు అదనంగా ఖర్చుపెట్టయినా కృష్ణానది నుంచి కాల్వల ద్వారా నేరుగా నీటిని తీసుకురావడానికి ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు. ఆయకట్టు పెంచకుండా రూ.కోట్లు దండుకునే కుట్ర ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రజలకు మోసపూరితమైన తాయిళాలు ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అవినీతి, మాఫియా పాలన సాగుతోందని విమర్శించారు. మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల పేరిట రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. గద్వాలలో టీఆర్‌ఎస్‌ అంటేనే ఇసుక, బియ్యం, మట్టి మాఫియగా మారిపోయిందని ధ్వజమెత్తారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న గద్వాల టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బూత్‌స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ప్రకాష్‌రావు, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, రాముడు, శివారెడ్డి, వెంకటస్వామిగౌడ్,  హన్మంతరెడ్డి, రాజప్ప, సంధ్య, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top