రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది : బొత్స

Minister Bosta SatyaNarayana Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : రాజధానిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికికో, ఒక సామాజిక వర్గానికో లేదా రాజకీయ నాయకుల సొంతం కాదని మరోసారి పునరుద్ఘాటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ప్రాంతాల మధ్య తారతమ్యం రాకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతమని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజానికానికి సంబంధించిన అంశమని, ఒక కులానికో, ప్రాంతానికో పరిమితం కాదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తెలిపారు. టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. వరద సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ముంపు నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు.  రైతులకు చిన్న కష్టం వచ్చిన తమ ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ అంశం దొరుకుతుందా.. దాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందుదామా అని ప్రతిపక్షం చూస్తుంది. కృష్ణా, పెన్నానది ప్రాంతంలో వరదలు వచ్చాయి. అన్ని శాఖలు సమన్వయంతో అన్ని ప్రాజెక్టులను పర్యవేక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో బేరీజు వేసుకుంటూ ఏ విధమైన నష్టం జరగకుండా కార్యక్రమాలు చేశారు. ఇంత వరదలు వచ్చినా పెయిడ్‌ ఆర్టిస్టులతో ఏ విధంగా విషప్రచారం చేయించారో చూశాం. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంటే.. హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. వరదలు ఆగిపోయిన తరువాత వచ్చి పర్యటించినా ప్రజల నుంచి స్పందన లేదు. అయినప్పటికీ కార్యకర్తలను పెట్టుకొని ప్రభుత్వంపై నిందలు వేసి వెళ్లిపోయారు.

బాబుకు బురదజల్లే ప్రయత్నం తప్ప బాధ్యత లేదు
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం. రైతుకు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభుత్వం సహించలేదు. ఏ కార్యక్రమం చేసినా అదే నేపథ్యంలో చేపడుతున్నాం. రైతుకు కష్టం కలిగించే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చేయదు. నా ఇల్లు ముంచడానికే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు. ఇల్లు ముంచాలని అనుకుంటే అరగంట వరద ఆపితే సరిపోయేదని, కానీ, ప్రభుత్వం ఎవరికీ కష్టం కలిగించే ప్రయత్నం చేయదన్నారు. కృష్ణలంక, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాలని కోరాం. అలాగే చంద్రబాబు ఇంటికి వరద ప్రమాదం ఉందని ముందే చెప్పాం. దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తూ, తండ్రీకొడుకులు ట్విటర్‌లో హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాల హిస్టరీ ఇదేనా ’చంద్రబాబూ’  అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ప్రయత్నం తప్ప బాధ్యత లేదని, చంద్రబాబు ఇంకెప్పుడు తెలుసుకుంటారో తెలియడం లేదన్నారు. 

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది
తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుంటే సుజనా చౌదరి కూడా అదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విషయం ఏదైనా ఉంటే సూటిగా, బాధ్యతగా మాట్లాడాలని సుజనా చౌదరికి సూచించారు. రాజధాని ప్రాంతంలో భూముల్లేవంటూ సుజనా అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. సుజనాచౌదరి అల్లుడు జితిన్‌కుమార్‌ పేరుతో ఉన్న కలింగ గ్రీన్‌ టెక్‌ కంపెనీ పేరుమీద 110 ఎకరాలు ఉన్నాయన్నారు. సుజనా చౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఇది ఒకటని చెప్పారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు ఉందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆయన సోదరుడి కుమార్తె యలమంచిలి రుషికన్య పేరుమీద వీర్లపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉందన్నారు. ఒక్క ఎకరా చూపించమన్న సుజనా చౌదరికి 124 ఎకరాలు వారి కుటుంబాల పేరు మీద ఉన్నట్లు చూపించానన్నారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసి తెలంగాణలో పెట్టుబడులు చూస్తున్నామని యనమల రామకృష్ణుడు, హైదరాబాద్‌లో రియలెస్టేట్‌ చేస్తున్నామని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబులా రియలెస్టేట్‌ వ్యాపారం చేయడం తమకు రాదన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అక్రమాలకు తావుండదని మంత్రి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top