
సాక్షి, ఎస్.కోట(విజయనగరం): ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 272వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం కోట్యాడ నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కిర్ల గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున జననేతను కలిసారు. గ్రామానికి సంబంధించిన సమస్యలను రాజన్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లారు.
అధికార టీడీపీ దుర్మార్గ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కుటుంబం ఎస్.కోట నియోజకవర్గం నుంచి సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహిస్తున్నా.. తమ గ్రామాల్లో ఒక రోజు మంచి నీరు వస్తే నాలుగు రోజులు రావని, కరెంట్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని జాగారం గ్రామ మహిళలు వైఎస్ జగన్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానని వైఎస్ జగన్ వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. రాజన్న తనయుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా... వారందరితో జననేత ఆత్మీయంగా చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగారు.