మామపై అల్లుడి తిరుగుబాటు!

Krishank Versus Sarvey Satyanarayana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన మామ సర్వే సత్యనారాయణపై రెబల్‌గా పోటీ చేస్తానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రకటించారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్‌ రాకుండా తన మామ అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు ఓడిపోయిన తన మామకు టిక్కెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా​ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు.

‘నా పేరు క్రిశాంక్ మాత్రమే. నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు. నాకు టిక్కెట్‌ వస్తుందన్న నమ్మకంతో నేను 6 నెలలుగా బస్తీ నిద్ర చేసి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాను. మా జేబులు ఖాళీ అయ్యాయి. నేను 2 పైసల పనిచేయలేదని, ఓడిపోతానని సర్వే సత్యనారాయణ ప్రచారం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంట్లో పది మంది ముందు నన్ను దారుణంగా అవమానించారు. డబ్బులు ఉంటేనే టికెట్ వస్తుందని, 10 కోట్లు ఖర్చుపెట్టాలి నువ్వు ఎక్కడి నుంచి తెస్తావని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆశయాలను నరనరాల్లో జీర్ణించుకున్నాం. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల నాకు టికెట్ దక్కలేదు. ఇంకా వేచిచూసే ఓపిక మాకు లేదు. మళ్లీ ఎవరో ఒక పారాచూట్ నాయకుడు వస్తాడు. తొలి జాబితాలో ఒక్క ఓయూ విద్యార్ధికి కూడా టికెట్ దక్కకపోవడం అత్యంత బాధాకరం. అందుకే నేను రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నా’నని క్రిశాంక్‌ తెలిపారు.

న్యాయంగా నాకే దక్కాలి
సర్వే సత్యనారాయణ లోక్‌సభకు పోటీ చేస్తారని, ఎమ్మెల్యే టిక్కెట్‌ తనకే ఇస్తారన్న ఉద్దేశంతో క్రిశాంక్‌ కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సొంత మామ తన టిక్కెట్‌ను ఎగరేసుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. న్యాయంగా కంటోన్మెంట్ టికెట్ తనకే దక్కాలని ఆయన అంటున్నారు. సర్వే సత్యనారాయణ లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయకుండా, ఇక్కడ ఎందుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారో అర్థం కావడం లేదని క్రిశాంక్‌ వాపోయారు. 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా క్రిశాంక్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరి క్షణాల్లో టికెట్ దక్కలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top