‘మార్చ్‌’కు నిరాకరణ ; అరెస్టులపై కోదండరాం ఫైర్‌

Kodandaram Condemns Arrest Of TJAC Leaders Along The State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఘట్టం ‘మిలియన్‌ మార్చ్‌’  వార్షికోత్సవాలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. మార్చి 10న కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీజేఏసీ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గురువారం రాత్రి నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. కాగా, ఈ అరెస్టులను కోదండరాం ఖండించారు. నిర్బంధాల ద్వారా ప్రజాస్వామిక ఆకాంక్షలను అణిచివేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే జేఏసీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మిలియన్‌ మార్చ్‌ సందర్భంలోనే కోదండరాం నూతన రాజకీయ పార్టీ ప్రకటన చేయాలని భావించడం తెలిసిందే.

మార్చ్‌కు అనుమతి లేదు : ఈ నెల 10వ తేదీన ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నిర్వహణకు అనుమతించాలి టీజేఏసీ, సిపిఐలు ఇప్పటికే పోలీసులను కోరాయి. ‘ఆట, పాట, మాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ జెఏసి తరఫున చాడ ఈ నెల 2న నగర సెంట్రల్ జోన్ డిసిపికి దరఖాస్తు చేశారు. అయితే, నగరం నడిబొడ్డున కార్యక్రమం చేపట్టడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, పైగా పరీక్షలు కూడా జరుగుతుండటంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారని, అందుకే అనుమతి ఇవ్వడం కుదరదని డిసిపి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జరిగిన మిలియన్ మార్చ్‌లో సంఘ విద్రోహశక్తులు చొరబడి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన అనుభవాన్ని కూడా పోలీసులు గుర్తుచేశారు. ఆ సందర్భంగా చాలా మందికి గాయాలు కావడం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, ఆప్పట్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top