కూర్పులో కేసీఆర్‌ నేర్పు

KCR Mark In Cabinet Expansion - Sakshi

ఉద్యమ నేపథ్యం, కీలక సందర్భాల్లో పార్టీలో చేరినవారికి అవకాశం

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ

త్వరలో ముఖ్య నేతలతోపాటు మరికొందరికి నామినేటెడ్‌ పదవులు 

సాక్షి, హైదరాబాద్‌ : పదవుల పందేరం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో జోష్‌ నింపింది. ప్రభుత్వ పనితీరుపై ఇంటా బయటా విమర్శలు వస్తున్న నేపథ్యం లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ శరవేగంగా పావులు కదిపారు. బీజేపీ దూకుడు, ఈటల వ్యాఖ్యల కలకలం, రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. శనివారం శాసనసభ, శాసనమండలి చీఫ్‌విప్‌లు, విప్‌ల జాబితాను ఏకకాలంలో విడుదల చేయడంతోపాటు ఆదివారం మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించారు. మండలి చైర్మన్‌ ఎన్నికకు కూడా రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మిగతా నామినేటెడ్‌ పదవులపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీమంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారితోపాటు పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌ వంటి నేతలకు త్వరలో కీలక పదవులు ఇస్తామనే సంకేతాలు కూడా సీఎం ఇచ్చారు. 12 మంది ఎమ్మెల్యేలను కీలక కార్పొరేషన్లకు చైర్మన్లు గా నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 70కి పైగా కార్పొరేషన్లు, ఇతర పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో త్వరలో టీఆర్‌ఎస్‌లో నామినేటెడ్‌ పదవుల పందేరం వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 

సామాజిక సమీకరణాలకు పెద్దపీట 
తాజా మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్‌ విప్, విప్‌ల నియామకంలో సీఎం కేసీఆర్‌ సామాజికవర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఆయా జిల్లా ల్లో స్థానిక రాజకీయ పరిస్థితులతోపాటు కీలక సమయాల్లో ఇతర పార్టీల నుంచి చేరినవారిని కూడా కీలక పదవులకు ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన హరీశ్‌రావు, కేటీఆర్‌కు వరుసగా రెండో పర్యాయం మంత్రివర్గంలో చోటుకల్పించారు. ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి వచ్చిన గంగుల కమలాకర్, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీని వీడిన సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవులు దక్కాయి. తొలి శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. వీరిద్దరికి కూడా మంత్రి పదవులు కట్టబెట్టారు.  

ఆచితూచి పదవుల పంపిణీ 
గతంలో శాసన మండలి చైర్మన్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన స్వామిగౌడ్‌ వ్యవహరించగా, ప్రస్తుతం గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేశారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లును విప్‌ పదవి నుంచి చీఫ్‌విప్‌గా ప్రమోట్‌ చేశారు. కాంగ్రెస్‌ నుంచి వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేరిన కె.దామోదర్‌రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్, టి.భానుప్రసాద్‌లకు కూడా విప్‌లుగా అవకాశం కల్పించారు. ఉద్యమ సమయంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన కర్నె ప్రభాకర్‌ను మండలి విప్‌గా నియమించారు. ఉద్యమసమయం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలంగాణలో ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కావడం కలిసి వచ్చింది. సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవిని ఇవ్వడంతో.. గత శాసనసభలో మాదిరిగానే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిని విప్‌గా మరోమారు కొనసాగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓ సామాజికవర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి విప్‌గా అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన రేగ కాంతారావు(ఎస్టీ)తో పాటు, టీఆర్‌ఎస్‌ యువ ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌కు విప్‌గా అవకాశం దక్కింది. 

కరీంనగర్‌ జిల్లాకు పెద్దపీట 
రాష్ట్ర మంత్రివర్గంలో కరీంనగర్‌ జిల్లాకు పెద్దపీట వేస్తూ.. ఏకంగా 4 మంత్రిపదవులు కేటాయించారు. హరీశ్‌రావు చేరికతో సీఎం కేసీఆర్‌సహా ఇద్దరికి ఉమ్మడి మెదక్‌ నుంచి ప్రాతినిథ్యం దక్కింది. హైదరాబాద్, పూర్వపు మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరేసి, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లా నుంచి ఒక్కొక్కరికి మంత్రులుగా అవకాశం లభించింది. సామాజికవర్గాల కోణంలో చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి నలుగురు, రెడ్డి సామాజికవర్గం నుంచి ఆరుగురు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమ్మ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది.  

బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే... 
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న బీజేపీ ఇటీవల ఇతర పార్టీల నుంచి వలసలు ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా ఎదిగేందు కు పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌తోపాటు, బయటా కూడా చర్చ జరుగుతోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ ఎదురవుతుందనే అంచనాల నేపథ్యం లో..రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.  గవర్నర్‌ మార్పు కూడా రాజకీయ కోణంలోనే జరిగిందనే ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు పదవుల పందేరాన్ని కేసీఆర్‌ వ్యూహంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ దూకుడు కు అడ్డుకట్ట వేసేందుకు  కేటీఆర్‌కు మరోమారు మంత్రిగా అవకాశం ఇవ్వడంతోపాటు, తాజా కేబినెట్‌ విస్తరణను  చేపట్టినట్లు తెలుస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top