కర్ణాటక పీఠాన్ని నిర్ధేశించేది ఈ సీటే.. | This Karnataka Assembly Seat Decides Who Forms Next Government | Sakshi
Sakshi News home page

కర్ణాటక పీఠాన్ని నిర్ధేశించేది ఈ సీటే..

May 11 2018 1:07 PM | Updated on Sep 5 2018 1:55 PM

This Karnataka Assembly Seat Decides Who Forms Next Government - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైన క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఒకే నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. గడగ్‌ జిల్లాలోని బాంబే కర్ణాటక ప్రాంతంలోని సిరహట్టి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందితే పాలనా పగ్గాలు సైతం అదే పార్టీకి అందివస్తున్నాయి. 1972 నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోంది. 1972లో సిరహట్టి స్ధానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన వదిరాజ్‌చార్య గెలుపొందగా ఆ పార్టీకి చెందిన దేవరాజ్‌ ఉర్స్‌ సీఎం పీఠం అధిష్టించారు. 1983 వరకూ ఈ స్ధానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ తన సిట్టింగ్‌ ఎమ్మెల్యే పకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. 1983లో జనతా పార్టీకి చెందిన రామకృష్ణ హెగ్డే కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1985లో జనతా పార్టీ సిరహట్టిలో గెలుపొంది కర్ణాటక సీఎంగా హెగ్డే రెండోసారి అందలం ఎక్కారు.

ఇక 1989లో కాంగ్రెస్‌ తిరిగి సిరహట్టిలో గెలుపొందగా, ఆ పార్టీకి చెందిన వీరేంద్ర పాటిల్‌ సీఎం అయ్యారు. రాష్ట్రం‍లో కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు తలెత్తడంతో ఆయనను సీఎం పదవి నుంచి అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీవ్‌ గాంధీ తొలగించారు. ఐదేళ్ల అనంతరం స్వతంత్ర అభ్యర్థి పకీరప్పను జనతాదళ్‌ అభ్యర్థి మహానటేశ్వర్‌ ఓడించిన క్రమంలో ఆ పార్టీకి చెందిన దేవెగౌడ 1994లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1999లో కాంగ్రెస్‌ తిరిగి సిరహట్టి సీటును గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక సీఎంగా ఎన్నికయ్యారు. 2004లో కొద్ది మెజారిటీతో ఈ స్ధానంలో కాంగ్రెస్‌ గెలుపొందినా కాం‍గ్రెస్‌ మద్దతుతోనే జెడీ(ఎస్‌)కు చెందిన దేవెగౌడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీతో చేతులు కలపడం కూటమి ప్రభుత్వం విఫల ప్రయోగంగా నిలిచింది.

మరోవైపు 2008లో బీజేపీ సిరహట్టి స్థానంలో గెలుపొంది కర్ణాటకలో దక్షిణాదిలోనే తొలిసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2013లో సిరహట్టిలో కాంగ్రెస్‌ గెలుపొంది సిద్దరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిరహట్టిలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. యువ ఓటర్లు అధికంగా ఉన్న సిరహట్టిలో పట్టు కోసం ప్రధాన పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి. ఉత్కంఠ పోరులో సిరహట్టి ఏ పార్టీని వరిస్తుందో రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడుతుందోననే ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement