కన్నాకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు

Kanna Lakshmi Narayana as BJP State president - Sakshi

సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ, గుంటూరు, గన్నవరం: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కార్యాలయ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఆదివారం జారీ చేశారు. మరోవైపు పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షునిగా నియమితులవుతారని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ కన్వీనర్‌గా నియమించారు. పార్టీ నిబంధనావళి ప్రకారం పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీనే.. ఎన్నికలప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లను జాతీయ కమిటీకి సూచిస్తుంది.

అలాంటి కీలక బాధ్యతల్లో ఆయన్ను నియమించడం విశేషం.  బీజేపీ నిబంధనావళి ప్రకారం ఆరేళ్లపాటు సభ్యత్వ మున్న వారినే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వంటి పదవుల్లో నియమించాల్సి ఉంటుంది. అయితే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరి మూడున్న రేళ్లే అయింది. అయినప్పటికీ రాజకీయ అనుభవంతోపాటు ఆర్థిక వనరులున్న కన్నాకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించుకుందన్న ప్రచారం సాగుతోంది.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైనట్టు ఉత్తర్వులు వెలువడగానే గుంటూరు కన్నావారితోటలోని కన్నా కార్యాలయానికి పలువురు పార్టీ నేతలు చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో తనపై నమ్మకముంచి అప్పగించిన బాధ్యతలకు కట్టుబడి పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులైన విషయం తెలియగానే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం ఆయన ఇంటికొచ్చి కలిశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top