డేటాపై ఈసి కీలక నిర్ణయం

Important ECI Instructions - Sakshi

 డేటా లీక్‌ వివాదం నేపథ్యంలో ఓటర్లు ప్రభావితం కాకుండా అడ్డుకట్టకు ఈసీ..

సామాజిక మాధ్యమాల్లోని వినియోగదారుల సమాచారాన్ని ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతోంది. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా లీకేజీ అంశం భారత్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఉల్లంఘనలు జరగకుండా ఏయే చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు  మంగళవారం ( ఈ నెల 27న) ఈసీ  సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలపై చర్చించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు  సమావేశమవుతారు. ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత వివరాలతో కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) వివిధ దేశాల్లో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించినట్టు, మనదేశంలోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), తదితర పార్టీలతో ఆ సంస్థ భారత భాగస్వామి కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

సీఏ డేటా ఉల్లంఘనల నేపథ్యంలో ఫేస్‌బుక్‌తో ఈసీ కొనసాగిస్తున్న సంబంధాలను సైతం సమీక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీరావత్‌ పేర్కొన్నట్లు ఓ ఇంగ్లిష్‌ పత్రిక వెల్లడించింది. యువజన ఓటర్ల నమోదు ప్రోత్సాహానికి ఫేస్‌బుక్‌ సంస్థతో ఈసీ కలిసి పనిచేయడంతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకోవాలంటూ 2017 జూలైలో సామాజికమాధ్యమం వేదికగా భారతీయ వినియోగదారులకు 13 భాషల్లో ఈసీ విజ్ఞప్తులు పంపించింది. గతంలోనూ   ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు మూడుపర్యాయాలు ఫేస్‌బుక్‌తో ఈసీ కలిసి పనిచేసింది.   ఈ నేపథ్యంలో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ రిఫెరండం, ఇతర దేశాల్లోని ఎన్నికలను ప్రభావితం చేసిన విధంగా ఇక్కడి  లోక్‌సభ ఎన్నికల్లో జరగకుండా ఉండేందుకు పరిరక్షణచర్యలు చేపట్టేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఈసీ భావిస్తోంది.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చోటుచేసుకునే ఆయా పరిణామాలను తప్పుడు పద్ధతుల్లో పక్కదోవ పట్టించే ప్రయత్నాలు, శక్తులపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు ఈసీ అధికార ఒకరు వెల్లడించారు. ఈ చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమాలు ఉపయోగించి ఓటర్లను అవాంచిత ప్రభావానికి గురిచేయకుండా, వీటి ప్రభావం ఓటింగ్‌ ప్రతికూలంగా పడకుండా ఉండేలా చూడాల్సి ఉందని చెప్పారు.  ఎన్నికలు ప్రభావితమయ్యే ఏ అంశంపై అయినా ఈసీ దృష్టిపెడుతుందన్నారు.  వచ్చే వారం జరగనున్న సమావేశంలో మాత్రం ప్రధానంగా డేటా దుర్వినియోగానికి సంబంధించిన సమస్యల తీవ్రతను విశ్లేషించి, వాటిని అరికట్టేందుకు ఏయే చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రచారాన్ని సీఏ సంస్థ నిర్వహించిందన్న బీజేపీ ఆరోపణలపై సైతం ఈసీ సోషల్‌ మీడియా సెల్‌ నివేదిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రకటన, ఈ అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ త్రోసిపుచ్చినా, గురువారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటినే మళ్లీ సంధించారు. సీఏతో అంటకాగుతున్నది మీరంటే మీరంటూ బీజేపీ,కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అతిక్రమించే అంశాల పర్యవేక్షణకు మీడియా విధానాన్ని రూపొందిస్తున్నట్టు గతేడాది ఆగస్టులో సీఈసీ ఓపీ రావత్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు  కొన్ని ప్రజాసంబంధాల సంస్థలు చురుకుగా పనిచేస్తున్నట్టు ఈసీ దృష్టికి వచ్చిందని చెప్పారు. రోజురోజుకు  మొబైల్‌–ఇంటర్నెట్‌ టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ప్రభావం కేఊడా పెరుగుతోందన్నారు. అందువల్ల సామాజికమాధ్యమాల్లోని  ఆయా విషయాలు, అంశాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈసీ ఆ దిశలో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top