నారా వారి నయవంచన

I Am Quiting Congress Because Of Congress And TDP Alliance - Sakshi

అలవి కాని హామీలతో రాష్ట్రాన్ని నిలువునా ముంచారు

బాబుతో చేతులు కలిపినందుకే కాంగ్రెస్‌ పార్టీని వీడాను

డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ పెద్ద కుంభకోణం

ప్రత్యేక హోదా కోసం కట్టుబడిన వ్యక్తి వైఎస్‌ జగన్‌

 28న వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా: కిల్లి కృపారాణి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం...రైతు రుణమాఫీ చేస్తాం...డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేస్తాం.. అంటూ 2014 ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు వాటిని గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఆటలు సాగబోవని, అబద్ధాలు, అరాచకాలను గమనించిన ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు హోటల్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల ఇబ్బందులు గమనించారని,  ప్రజలకు ఏమి కావాలో గమనించి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, తండ్రి రాజశేఖరుడి బాటలో ప్రజాబాంధవుడిలా నిలుస్తారన్న నమ్మకం ఉందన్నారు.  ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకొస్తే వారికే కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మద్దతుంటుందని వైఎస్‌ జగన్‌ మొదటి నుంచీ చెబుతున్నారనీ.. రాష్ట్రానికి న్యాయం చేసే పార్టీతో ఉండాలనే ఆకాంక్షతో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి అజెండా సెట్‌ చేస్తే దానిని కాపీకొట్టి చంద్రబాబు అమలు చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. చంద్రబాబు కేసీఆర్‌తో కలిసిపోవచ్చు.. మోడీతో కలిసిపోవచ్చు.. రాహుల్‌గాంధీతో కలిసిపోవచ్చు కాని జగన్‌మోహన్‌రెడ్డి ఎవరితోనైనా మాట్లాడితే చాలు తన అనుకూల మీడియాతో ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బాబు నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు.    

దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు
ఇన్నాళ్లూ బీజేపీతో కాపురం చేసి.. ప్రత్యేకహోదా కోసం ఇసుమంత ప్రయత్నం కూడా చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు దొంగదీక్షలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. మమతా బెనర్జీ, మాయావతి తదితర నేతలను యూపీఏలో కలిసిపోవాలని సలహా ఇస్తున్న పెద్ద మనిషి టీడీపీని మాత్రం అలా చేయకుండా గోడ మీద పిల్లివాటంలా ప్రవర్తిస్తున్నారన్నారు. సిద్ధంతాలు, విలువలు లేని చంద్రబాబులాంటి వ్యక్తులు కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్న తీరు నచ్చకే పార్టీని వీడానన్నారు. రుణ మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను ఒకసారి మోసగించిన చంద్రబాబు.. పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు చెల్లని చెక్కులిచ్చి మళ్లీ మహిళలను ఏమారుస్తున్నారన్నారు. 

రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానన్నారు. ఎటువంటి పదవీ కాంక్షతో పార్టీలోకి రాలేదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ఈనెల 28వ తేదీన లోటస్‌పాండ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిల్లి రామ్మోహన్‌రావు, కె.రాజ్యలక్ష్మి, టి.బి.కె.గుప్త, జి.కృష్ణ, కిల్లి మల్లన్న, పైడి రవి, పైడి చందు, కె.డిల్లేశ్వరరావు, ఎస్‌.ధర్మారావు, డి.శ్రీధర్‌ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top