సంక్షేమం ఆగదు.. | Harish Rao Briefly Discuss On Telangana Budget In Assembly | Sakshi
Sakshi News home page

సంక్షేమం ఆగదు..

Mar 13 2020 2:34 AM | Updated on Mar 13 2020 2:34 AM

Harish Rao Briefly Discuss On Telangana Budget In Assembly - Sakshi

ఆర్థిక మాంద్యం నెలకొన్నా సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు సంక్షేమానికి నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్‌ ద్వారా ఆసరా పెన్షనర్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల విద్యార్థులు పెరుగుతున్నారన్న విషయాన్ని ప్రజలు, ఇతర పార్టీలు గ్రహించాలి. తొలిసారిగా రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల అభివృద్ధికి రూ.500కోట్ల నిధుల కేటాయింపు ఘనత మాకే దక్కుతుంది.

సాక్షి, హైదరాబాద్‌: డబ్బులకు వెనుకాడకుండా పేదలే ఎజెండాగా, ప్రజలే కేంద్ర బిందువుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆర్థిక మంత్రి టి. హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రతి ఇంటా సౌభాగ్యం, ప్రతి కంట్లో సంతోషం చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రపంచం ఆగ మయినా, దేశంలో ఏం జరిగినా, ఎంత కష్టమొచ్చినా రాష్ట్రంలో సంక్షేమం ఆగదని తేల్చి చెప్పారు. తమ బడ్జెట్‌ ప్రజలను సంతోషపెట్టిందని, కాంగ్రెస్‌ను మాత్రం నిరాశపరిచిందని ఎద్దే వా చేశారు.

ప్రతిపక్షం చెబుతున్నట్లు ఈ బడ్జెట్‌ ప్రజలను భ్రమల్లోకి నెట్టలేదని, కాంగ్రెస్‌ నేత ల భ్రమలను బద్దలు కొట్టిందన్నారు. 2020– 21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ అనంతరం ప్రభుత్వ పక్షాన హరీశ్‌రావు గురువారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, విధానాలను, ఐదున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు. హరీశ్‌ బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

మాంద్యంలోనూ సంక్షేమానికి నిధులు... 
‘‘ఆర్థిక మాంద్యం నెలకొన్నా సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు సంక్షేమానికి నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్‌ ద్వారా ఆసరా పెన్షనర్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల విద్యార్థులు పెరుగుతున్నారన్న విషయాన్ని ప్రజలు, ఇతర పార్టీలు గ్రహించాలి. తొలిసారి గా రాష్ట్ర ఖజానా నుంచి దేవాలయాల అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధుల కేటాయింపు ఘనత మాకే దక్కుతుంది. హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం ఎన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసినా, స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా ప్రయోజనం లేకపోవడంతో ఈసారి బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లను హైదరాబాద్‌ అభివృద్ధికి కేటాయించాం. రైతు సంక్షేమం కోసం రైతు బంధు నిధులు పెంచడంతోపాటు మార్కెట్‌ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. రైతు బీమా బడ్జెట్‌ పెంచడంతోపాటు రైతు వేదికలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం. 

కాంగ్రెస్‌ది కరెంటు బంద్‌ ప్రభుత్వం... 
విద్యుత్‌రంగ అభివృద్ధి లెక్కలు చెబితే కాంగ్రెస్‌ నేతలు పశ్చాత్తాపపడక తప్పదు. ఎంత డిమాండ్‌ ఉన్నా కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. కాంగ్రెస్‌ పార్టీది కరెంటు బంద్‌ ప్రభు త్వమైతే మాది రైతు బంధు ప్రభుత్వం. దేశంలోనే ప్రజారోగ్యం అందిస్తున్న మూడు రాష్ట్రా ల్లో తెలంగాణ ఒకటి. గతంలో రాష్ట్రంలో ఒక్క డయాలసిస్‌ సెంటర్‌ కూడా ఉండేది కాదు. ఇప్పుడు 40కిపైగా ఏర్పాటు చేశాం. జిల్లాకు నాలుగైదు ఐసీయూ యూనిట్లు పెట్టాం. 

కేసీఆర్‌ పేదల మనిషి... 
ఎన్నికలకు ముందు వరాలివ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం మా విధానం కాదు. మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కల్యాణలక్ష్మి, రైతు బంధు, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలను అమలు చేస్తున్నాం. ఎన్నికలు, ఓట్లు, సీట్ల కోసం పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్‌ కాదు. ఆయన పేదల మనిషి. మానవీయకోణంలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన మనిషి. కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్దిపేట పరిధిలోని ఇమాంబాద్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి తన అల్లుడు కట్నంగా సైకిల్‌ అడుగుతున్నాడని, అది ఇవ్వకపోతే కూతురు పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఉందని చెబితే వెంటనే సైకిల్‌ ఇచ్చి పంపించిన హృదయం కేసీఆర్‌ది. 

అందుకే ఆయన సూచనల మేరకు ఈసారి బడ్జెట్‌లో కల్యాణలక్ష్మికి రూ. 700 కోట్లు పెంచాం. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్, రుణమాఫీ, గుడుంబా నిర్మూలన, పునరావాసం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే. గృహ నిర్మాణ రుణాల మాఫీ, నీటి తీరువా రద్దు, తాటి చెట్లపై పన్ను రద్దు, చేనేత రుణాలు, ఆటో, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సెలూన్లకు డొమెస్టిక్‌ కేటగిరీ వర్తింపు, నివాస స్థలాల క్రమబద్ధీకరణ, సాదాబైనామాల పరిష్కారం లాంటి చాలా కార్యక్రమాలను ప్రజల కోసం చేశాం. 

పన్నేతర ఆదాయంపై క్లారిటీ ఉంది.. 
పన్నేతర ఆదాయం పెంచుకొనే విషయంలో మాకు క్లారిటీ ఉంది. వాణిజ్య పన్నుల శాఖలో అపరిష్కృత కేసుల వన్‌టైం సెటిల్‌మెంట్, మైనింగ్, ఇసుక కొత్త పాలసీ, కోకాపేటలో గెలిచిన భూముల అమ్మకం, పరిశ్రమలకు లీజుకిచ్చిన భూముల క్రమబద్ధీకరణ ద్వారా అదన పు ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ఈ విషయంలో కాంగ్రెస్‌కు అనుమానాలు అక్కర్లేదు. అభివృద్ధి ప్రజలకు కనపడుతున్నందునే ప్రతి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తున్నారు. మూసీ నది పాపం, పుణ్యం కాంగ్రెస్‌దే. 

ఆ కంపును వదిలించేందుకు మేము కంకణం కట్టుకున్నాం. ఈ విషయంలో కాంగ్రెస్‌ చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి. అవసరమైతే అప్పులు మరిన్ని తెచ్చయినా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం. కాంగ్రెస్‌లాగా సంకుచిత ధోరణులు మాకు ఉండవు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగానే అప్పులు తెస్తున్నాం. ఈ విషయంలో ఎక్కడా పరిధి దాటట్లేదు. అప్పులతోపాటు జీఎస్‌డీపీ పెరిగిందని ప్రతిపక్షాలు గుర్తించాలి. 

కేంద్రం నిధులివ్వట్లేదు... 
కేంద్రం నుంచి ఆశించినంత సాయం అందట్లేదు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, మిషన్‌ కాకతీయ, భగీరథ గ్రాంట్లు, వెనుకబడిన జిల్లాలకు సాయం, పన్నుల వాటా కలిపి రూ. 10 వేల కోట్లకుపైనే రావాల్సి ఉంది. అయినా ప్రజల కోసం ఖర్చుకు వెనుకాడం. మాది పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసమే ప్రతిపైసా ఖర్చు పెడతాం.

కాంగ్రెస్‌ది వద్దుల పార్టీ.. అందుకే ప్రజలు వద్దనుకున్నారు 
బడ్జెట్‌ గురించి కాంగ్రెస్‌ ఒక్క మంచి మాటయినా చెబుతుందని ఆశించాం. అయినా కాంగ్రెస్‌ సభ్యులు మాత్రం పాడిందే పాట పాచిపళ్ల బాట అన్న రీతిలోనే విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు కరెంటు వద్దంటారు.. జిల్లాలు, ప్రాజెక్టులు, మిషన్‌ భగీర థ వద్దని చెబుతారు. అందుకే కాంగ్రెస్‌ వద్దు ల పార్టీ అయింది. ప్రజలు కూడా ఆ పార్టీ వద్దని రద్దు చేశారు. వరుస ఓటములతో అ యినా ఆ పార్టీకి జ్ఞానోదయం అవుతుందని ఆశించినా, అన్ని ఎన్నికల్లో ప్రజలు గుణపా ఠం చెప్పినా వారి తీరులో మార్పులేదు. ప్రజ లు కర్రుకాల్చి వాతపెడుతున్నా ఆత్మవిమర్శ చేసుకోని కాంగ్రెస్‌ను ఆ దేవుడే కాపాడాలి.’’  

చదవండి:
‘అప్పుడు కరెంట్‌ బందు.. ఇప్పుడు రైతు బంధు’

క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement