టీడీపీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ నేత సవాల్‌ | Gudivada Amarnadh Slams TDP MPs And Leaders On Railway Zone | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ నేత సవాల్‌

Jul 4 2018 10:54 AM | Updated on Aug 20 2018 6:07 PM

Gudivada Amarnadh Slams TDP MPs And Leaders On Railway Zone - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందో, లేక రైల్వేశాఖ మంత్రి ఇంటి ముందో ధర్నా చేయాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు‌. టీడీపీ నేతల డ్రామాలను జనాలు గుర్తించారని, ఇక స్థానిక రైల్వేస్టేషన్లలో రైల్వే జోన్ గురించి దీక్ష చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలతో ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నారని, నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ అంశాన్ని ఆరు నెలల్లోగా తేల్చాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్‌ గుర్తుచేశారు. అదే విధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీపై కూడా 6 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఉండగా.. ఈ నాలుగేళ్లు టీడీపీ నేతలు నిద్రపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతల డ్రామాలు ఎలా ఉన్నాయంటే.. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నాయన్న భయంతో నేడు టీడీపీ నేతలు పోరాటం కొనసాగిస్తున్నట్లు నటిస్తున్నారంటూ మండిపడ్డారు. రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేసిన పోరాటాన్ని గుర్తుకుచేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులను కలుపుకుని పోరాటం చేస్తే వైఎస్సార్‌సీపీ నేతలను అధికార టీడీపీ నేతలు అవహేళన చేశారు. ప్రజలను మభ‍్యపెడుతున్న టీడీపీ నాయకులకు నిజంగా సిగ్గుందా అని ప్రశ్నించారు. 

‘మరికొన్ని రోజుల్లో ప్రకటన వస్తుందనగా ఇప్పుడు దీక్షలేందుకు అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచినా ఏం లాభం లేదు. ఈ ఏడాది మార్చి వరకు టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించారు. కానీ ఏం సాధించారు. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ డ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలరోజుల్లో ప్రకటన రాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన ఆ ఎంపీ ఇటీవల ఢిల్లీలో ఏం మాట్లాడారో ఏపీ మొత్తం చూసింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలను ఏపీ ప్రజలు ఓసారి గుర్తుచేసుకోవాలి. జోను లేదు.. గీను లేదు అంటూ చాలా చులకనగా మాట్లాడి అవంతి శ్రీనివాస్ దొరికిపోయారు. మరో ఎంపీ మురళీమోహన్‌ అయితే 5 కేజీల బరువు తగ్గాలంటే ఎన్ని రోజులు దీక్ష చేయాలి అనడం వీడియోల్లో స్పష్టంగా చూశాం. ఎన్డీఏ నుంచి బయటకొచ్చినప్పటికీ బీజేపీకి టీడీపీ ఎంపీలు రహస్య మిత్రులుగా ఉన్నారు. టీడీపీ చేసిది దీక్షలు కాదు కిట్టీ పార్టీల్లా ఉన్నాయంటూ’  ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధిలేని టీడీపీ నేతలపై గుడివాడ అమర్‌నాథ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement