బీజేపీ 200 కోట్లు ఆఫర్‌ చేసినా..!

GT Devegowda Says That MLAs With Us After 100 Crore Proposal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కర్ణాటక రాజకీయాలు దేశ వ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా.. లేక కాంగ్రెస్‌-జేడీఎస్‌ అధికారం హస్తగతం చేసుకుంటుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా సీఎం యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వగా, శనివారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు శుక్రవారం హైదరాబాద్‌కు మకాం మార్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జేడీఎస్‌ సీనియర్‌ నేత, చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. బల పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి కచ్చితంగా నెగ్గి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగలేదు. బీజేపీ 100 కోట్లు కాదు 200 కోట్ల రూపాయలు ఇచ్చినా మా ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరలేదని గ్రహించాలి. మా ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే మా వద్దే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం వేకువజామున బెంగళూరుకు తిరిగి వెళ్లనున్నట్లు వివరించారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో మాజీ సీఎం సిద్దరామయ్యపై నెగ్గిన వ్యక్తి టీజీ దేవెగౌడ కావడం గమనార్హం.

శనివారం సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని, ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. అసెంబ్లీలో రహస్య బ్యాలెట్‌ ద్వారా బలపరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశమై బల పరీక్షలో నెగ్గడంపై చర్చించనున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top