
కల్లూరు (రూరల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రను విజయవంతం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చేపట్టబోయే ప్రజాసంకల్ప పాదయాత్రను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగబోదన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ఎలా మోసం చేశారో వివరిస్తామన్నారు. రుణమాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత టీడీపీ అధినేతదేనన్నారు. మోసం చేయడమే ముఖ్యమంత్రి, టీడీపీ నాయకుల నైజమన్నారు.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి ఇరుక్కున్నారని, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఇంతవరకూ విచారణ లేదన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారని, పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని..సాక్షాత్తు ఏపీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చొక్కాపట్టుకుని అవమానించారని..అయినా వారిపై చర్యలు లేవన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడైన కేఈ శ్యామ్‌బాబును ఆరునెలలైనా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. కేఈ శ్యామ్‌బాబును అరెస్ట్ చేయకపోతే త్వరలోనే నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.
చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. తుని సంఘటనలో రైలును తగలబెట్టింది ఎవరో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారితో రాజీనామా చేయించేదాకా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.