
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండటానికి వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో జగన్ చేపట్టిన పాదయాత్ర విశేష ప్రజాదరణ పొందిందన్నారు. ప్రతినిత్యం లక్షలాదిమంది ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ వారి సమస్యలను వింటూ, వారికి న్యాయం జరిగేలా చూడాలని నిత్యం పరితపించే జననాయకుడు జగన్ అని పేర్కొన్నారు. లక్షలాదిమంది ప్రజలు బాసటగా నిలుస్తూ, స్వచ్ఛందంగా ఆయన అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఆయనకు వస్తున్న ప్రజాభిమానాన్ని తట్టుకోలేని కొందరు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఏపీలో వైస్సార్‌సీపీ కార్యకర్తలపై మొదలైన దాడులు జననాయకునిపై దాడి వరకు చేరాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనటానికి ఇది ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యనేతపై దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.