భూముల ఆక్రమణపై ప్రతిపక్షనేతకు వినతి

Farmers Complained To Y S Jagan About Their Land Acquisition In Chakrayapeta - Sakshi

సాక్షి, పులివెందుల : చక్రాయపేట మండలంలో వెలుగు చూసిన రెవెన్యూ అధికారులు, కొంతమంది అధికార పార్టీ నాయకులు భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చక్రాయపేట మండలానికి చెందిన రైతులు చంద్రశేఖర నాయుడు, హరి నాయుడు, సిద్ధా రామాంజనమ్మ, శివమ్మలతోపాటు పెద్ద ఎత్తున రైతులు కోరారు. గురువారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న జగన్‌ను వారు కలిశారు. చక్రాయపేట మండలం తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ హనుమంతురెడ్డి మరికొంతమంది అధికారులు, సిద్ధా వెంకటేశ్వర్లతోపాటు అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులతో కలిసి పెద్దఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడటం జరిగిందన్నారు.

 పత్రికలలో కూడా వార్తలు వచ్చాయన్నారు. మండలంలో దాదాపు 2వేల నుంచి 2,500ఎకరాల వ్యవసాయ భూమిని భూ రికార్ట్స్‌ ట్యాంపరింగ్‌ ద్వారా ఆక్రమించారన్నారు.  మండలంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఇప్పటికే మండల వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి వైఎస్‌ కొండారెడ్డి ఆధ్వర్యంలో భూ ఆక్రమణలపై తాము పోరాటం చేస్తున్నామన్నారు. కలెక్టర్‌కు తెలియజేశామన్నారు. తరతరాలుగాసాగు చేసుకుంటున్న పట్టా భూమి, ప్రభుత్వం నుంచి పొందిన డీకేటీ భూమి అనే తారతమ్యం లేకుండా ఆక్రమణదారులు తప్పుడు పత్రాలు సృష్టించి భూములను కైవసం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారన్నారు.  సాగు భూమిని మాయ చేసి వారికి ఇష్టమొచ్చిన పేర్లతో రెవెన్యూ కార్యాలయంలో నమోదు చేసుకున్నారన్నారు.

ఒకరి పేరుపై ఉన్న భూమిని మరో వ్యక్తి పేరుతో అక్రమ పట్టాదారు పాసు పుస్తకాలు పుట్టించారన్నారు. ఆ భూములపై దాదాపు రూ.5కోట్ల మేర బ్యాంక్‌ రుణాలు కూడా తీసుకున్నారని వైఎస్‌ జగన్‌కు వారు వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ భూములను ఈ విధంగా ఆక్రమించుకుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  

అధికార పార్టీ నాయకులు దోచేస్తున్నారు..  
మండలంలో అధికార పార్టీ నాయకులు రెవె న్యూ అధికారులతో కుమ్మక్కై రైతుల వ్యవసాయ భూములను అప్పనంగా దోచేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడినారు. వీరిపై చర్యలు చేపట్టాలి.


– చంద్రశేఖరనాయుడు(రైతు), కల్లూరు పల్లె, చక్రాయపేట మండలం 

రైతుల భూములను లాక్కొంటున్నారు.. : 
టీడీపీ నాయకులు అన్యాయంగా రైతుల భూములను తమ పేరు మీద తప్పుడు పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించుకుని యథేచ్చగా అవినీతికి పాల్పడుతున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు సహకరించడం దారుణం.  

 – హరినాయుడు(రైతు), కల్లూరుపల్లె, చక్రాయపేట మండలం  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top