
జోగన్నపాలెం క్రాస్ వద్ద మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్
ఏలూరు టౌన్: కర్నూలు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన గతంలో రాయలసీమ ప్రాంత ఐజీగా పనిచేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం అడ్డరోడ్డు వద్ద పాదయాత్ర ప్రారంభ సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం అనుభవం ఉన్న నేతగా చంద్రబాబుకు పట్టం కట్టారని, కానీ ప్రజల కోరికకు విరుద్ధంగా ఈ నాలుగేళ్ల పాలన సాగిందని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలెవ్వరూ సింగపూర్‌ను కోరుకోవటం లేదని, తమ బాధలు పట్టించుకుని, కష్టాలు తీర్చే నాయకుడు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అన్నపూర్ణలాంటి రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు శ్మశానంగా మార్చారని ఆయన మండిపడ్డారు. రెండు తాత్కాలిక భవనాలు తప్ప రాజధాని నిర్మించలేదని దుయ్యబట్టారు. తమ పిల్లలను చదివించుకోలేక, ఆరోగ్యశ్రీ సదుపాయం లేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. మాటతప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్‌కు ప్రత్యేక హోదాపై స్థిరమైన అభిప్రాయం ఉందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు జగన్ మాత్రమేనని గుర్తించి పార్టీలో చేరినట్లు తెలిపారు.