
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్న పోలీసులు.. ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఎన్నికల బందోబస్తుకు వెళ్లే పోలీసులు ముందే పోస్టల్ బ్యాలెట్ తమకు అప్పగించాలంటూ పలు జిల్లాల్లో డీఎస్పీలు ఒత్తిళ్లు ప్రారంభించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న కొందరు పోలీస్ బాస్‌ల దన్నుతో వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. రాష్ట్రమంతటా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బందోబస్తుకు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఓట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యేలా పోలీసు బాస్‌లు మౌఖిళ ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ విషయంలో పోలీసు అధికారులు దృష్టిపెట్టారు. ఎన్నికల సిబ్బంది ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ తీసుకుని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి వాటిని తమకు అందజేయాలని కోరుతున్నారు. ఇందుకోసం పలువురు డీఎస్పీలు పని గట్టుకుని సీఐ నుంచి కానిస్టేబుల్స్ వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో బాహాటంగానే టీడీపీకి ఓటు వేయాలనే ఆదేశాలు ఇవ్వడాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పు బడుతున్నారు.
మా హక్కును కాలరాస్తున్నారు..
ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన వరమని, మాకు నచ్చిన వారికి స్వేచ్చగా ఓటు వేసుకునే అధికారాన్ని కూడా బాస్‌లు కాలరాస్తున్నారంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసారు. మా పైఅధికారులే ఇలా చెబితే ఎలా అని, అటువంటప్పుడు మా ఓట్లు కూడా వారే వేసుకునే అధికారం తీసుకోవచ్చు కదా అని గుంటూరు జిల్లాకు చెందిన ఒక సీఐ ప్రశ్నించారు. పోలీసులుగా సమాజంలో మంచి చెడులు చూస్తామని, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు, మాకు మేలు జరుగుతుందో చూసుకుంటామని, అటువంటి దానికి కీలకంగా ఉండే ఓటు హక్కుపై ఉన్నతాధికారులు నిర్భంధం పెడుతున్నారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక హోంగార్డు వాపోయాడు. రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు మా స్వేచ్ఛను కూడా హరించేలా ఉందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక కానిస్టేబుల్ వాపోయాడు.
ఇలా అనేక మంది పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ తీరు, బాస్‌ల వ్యవహారశైలిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై పోలీస్ వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను ముందే పసిగట్టిన కొందరు అధికారులు పోస్టల్ బ్యాలెట్‌లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసు సంఘాల పేరుతో పలువురు నాయకులు జిల్లాల్లో తిరుగుతూ టీడీపీకి ఓట్లు వేయించేందుకు ఒత్తిడి పెంచారు. మరోవైపు జిల్లాల్లోని పోలీసు అధికారులను ప్రయోగించి వారి వద్ద పనిచేసే దిగువస్థాయి సిబ్బందిపై ఓటు కోసం నిర్భందాలు, ఒత్తిళ్లు, వేధింపులకు దిగడం పట్ల పోలీసు శాఖలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.