బీజేపీ భిక్ష అక్కర్లేదు..మాకు నిధులున్నాయ్‌

Donot need BJP is money, Bengal has enough to rebuild Vidyasagar statue - Sakshi

విద్యాసాగర్‌ విగ్రహ ఏర్పాటుపై మమతా బెనర్జీ వ్యాఖ్య

ప్రధాని మోదీ ప్రతిపాదనను తిరస్కరించిన టీఎంసీ అధినేత్రి

మందిర్‌ బజార్‌/డైమండ్‌ హార్బర్‌: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు.  మందిర్‌ బజార్, డైమండ్‌ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు.

మోదీ గుంజిళ్లు తీయాలి..
బంగారం లాంటి పశ్చిమబెంగాల్‌ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్‌ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్‌ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్‌ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు.

ఈసీ అమ్ముడుపోయింది..
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top